తీసేసిన ఓట్లు పాము కాట్లు అవుతాయా?
posted on Nov 2, 2015 10:56AM

హమ్మయ్య.. ఎట్టకేలకు జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఏనాడో నిర్వహించాల్సి వున్నప్పటికీ, సీమాంధ్రుల ప్రాబల్యం ఎక్కువగా వున్న జీహెచ్ఎంసీలో పట్టు సాధించే ఉద్దేశంతో టీఆర్ఎస్ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. నగరంలోని టీడీపీ ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకోవడం, అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ, ముస్లింలకు ప్రోత్సాహకాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పథకం, ఒక్కో సామాజిక వర్గాలనికో భవనం... ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే, ఈ ప్రయత్నాలన్నీ బలపడేవరకూ జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించకూడదని జాప్యం చేస్తూ వచ్చింది. అయితే హైకోర్టు తీవ్రంగా ప్రశ్నించడంతో ఇక చేసేదేమీ లేక వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ లోపు జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనిమీద ప్రమాణ పత్రం సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రమాణ పత్రం సమర్పించక తప్పదు.. అలా సమర్పిస్తే జనవరి 31 లోపు ఎన్నికలు నిర్వహించకా తప్పడు.
అయితే వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ ఎన్నికలను ఇప్పడప్పుడే నిర్వహించే ఉద్దేశం లేదు. హైదరాబాద్‌లోని వివిధ వర్గాల ఓటర్లను ఆకట్టుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఇంకా ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని తంటాలు పడినా హైదరాబాద్ ఓటరు ఆ పార్టీ వైపు మొగ్గుచూపిన దాఖలాలు కనిపించడం లేదు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే పార్టీ మారారుగానీ, ఓటర్లు మాత్రం తమ అభిప్రాయాలను మార్చుకోలేదు. వారి అభిప్రాయాలను మార్చే ప్రయత్నాలు టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఫలితాలను ఇవ్వడం ప్రారంభించకముందే కోర్టు హుకుంతో జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రభుత్వం సన్నాహాలు చేయక తప్పని పరిస్థితి వచ్చిపడింది.
వీటికి తోడు బోగస్ ఓట్ల పేరుతో లక్షలాది మంది ఓట్లను తొలగించడం టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేనిపోని చిక్కులు తెచ్చిపెట్టినట్టు కనిపిస్తోంది. జీహెచ్ఎంసీలో తొలగించిన ఓట్లు అధికార పార్టీకి పాముకాట్లుగా మారే ప్రమాదం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఓట్ల తొలగింపు విషయంలో ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటి మీద నిలబడ్డాయి. ప్రభుత్వం ఇరుక్కుపోయే అనేక ఆధారాలను ఎన్నికల కమిషన్‌కి సమర్పించాయి. ఎన్నికల కమిషన్ కూడా ఈ విషయంలో చాలా లోతుగా దర్యాప్తు చేస్తోంది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారి ఓట్లను ఎలాంటి నోటీసులూ లేకుండా తొలగించారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఎన్నికల కమిషన్ దర్యా్ప్తులో నిజమేనని తేలితే అది జీహెచ్ఎంసీ ఎన్నికలలో అధికార పార్టీకి బాగా నష్టం కలిగించే ప్రభావం వుందని పరిశీలకులు భావిస్తున్నారు.