అనిశ్చితంగా సాగుతున్న కొండా సురేఖ రాజకీయ జీవితం

 

కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్ పార్టీని వీడినప్పటి నుంచి వారి రాజకీయ జీవితం నిలకడగా సాగడం లేదు. ఒక్కోసారి చాలా అనిశ్చితంగా, ఆందోళనకరంగా ఉంటోంది. స్వర్గీయ వైయస్సార్ మీద అభిమానంతో వారు కాంగ్రెస్ పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డి పంచన చేరారు. కానీ జగన్ వారికి హ్యాండ్ ఇచ్చేరు. రాష్ట్ర విభజన అనివార్యమని గుర్తించిన జగన్ రెండు రాష్ట్రాలకు మద్దతు ఈయకుండా, విభజన తరువాత జరుగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచి తన ముఖ్యమంత్రి కలను సాకారం చేసుకోవాలనే తాపత్రయంతో సమైక్యాంధ్ర స్టాండ్ తీసుకొన్నారు. ఆ కారణంగా ఆయననే నమ్ముకొన్న కొండా సురేఖ వంటి అనేకమంది తెలంగాణా నేతలు, కార్యకర్తలు రోడ్డున పడ్డారు.

 

వైకాపా సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయడం వెనుక అసలు ఉద్దేశ్యం అందరికీ తెలిసి ఉన్నప్పటికీ, దాని ఉద్యమాలతో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినట్లుగానే తెలంగాణా ప్రజలు భావించారు. అటువంటి పార్టీలో పనిచేసినందుకు కొండా సురేఖ దంపతులపై కూడా తెలంగాణా ద్రోహులు అనే ముద్ర పడింది. జగన్ తీసుకొన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారు వైకాపాకు రాజీనామాలు చేసినప్పటికీ, వారిపై పడిన ఆ ముద్రను నేటికీ తొలగించుకోలేకపోతున్నారు.

 

వారు వైకాపా నుంచి బయటపడిన తరువాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకొన్నారు కానీ తెరాసలోకి వెళ్లి పొరపాటు చేసారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపరుతున్నారు. ఒకవేళ వారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకే వెళ్లి ఉండి ఉంటే, ఇదివరకులాగే పూర్తి స్వేచ్చా స్వాతంత్ర్యాలు అనుభవిస్తూ తమ రాజకీయ జీవితం పునరుద్దరించుకోగలిగేవారు. బహుశః వరంగల్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం కొండా సురేఖకే దక్కేదేమో? తెరాసలోకి వెళ్ళడం వలన వరంగల్ జిల్లా రాజకీయాలలో చక్రం తిప్పడం సంగతి ఏమో గానీ కొండా సురేఖ తన ఉనికినే కోల్పోయారు.

 

ఇటువంటి సమయంలో కేసీఆర్ ఆమెకు పోటీగా తెదేపా నుంచి గుండు సుధారాణిని తీసుకువచ్చేరు. వారి మధ్య చిరకాలంగా జిల్లాలో రాజకీయ విభేదాలు ఉన్నాయి. అయితే ఇంతవరకు వారిరువురూ వేర్వేరు పార్టీలలో ఉన్నందున వారి రాజకీయ విరోధం వలన వారికేమీ పెద్దగా ఇబ్బంది కలుగలేదు. కానీ ఇప్పుడు వారిరువురూ ఒకే పార్టీలో పనిచేయవలసి రావడంతో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. అందుకే సుధారాణి చేరికను కొండా సురేఖ దంపతులు తీవ్రంగా వ్యతిరేకించారు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారి అభ్యంతరాలను పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెందారు. కాంగ్రెస్ నుంచి వైకాపాలోకి దాని లోంచి అధికారంలో ఉన్న తెరాసలోకి మారినా కొండా సురేఖ దంపతుల రాజకీయ జీవితం నిలకడగా లేదు..ఏమాత్రం సంతృప్తికరంగా కూడా లేదు. కనుక ఏదో ఒక రోజున వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరుకొంటారేమో?