ఈ రోజే వక్ఫ్ వార్.. ఉత్కంఠకు తెర !

దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న  వక్ఫ్ చట్ట  సవరణ బిల్లును ప్రభుత్వం  బుధవారం (ఏప్రిల్ 2) లోక్ సభలో ప్రవేశ  పెడుతోంది. లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే పార్లమెంటరీ,మైనారిటీ  వ్యవహారాల శాఖ మంత్రి  కిరణ్ రిజిజు బిల్లును సభలో  ప్రవేశ పెడతారు. సుదీర్ఘంగా ఎనిమిది నుంచి పది గంటల వరకు చర్చ జరిగే అవకాశం వుంది. ఇందుకు సంబంధించి మంగళ వారం (ఏప్రిల్ 1) జరిగిన బీఎసీ సమావేశంలో స్పీకర్ ఈ బిల్లుపై చర్చకు ఎనిమిది గంటల సమయం కేటాయించారు. అయితే  ముస్లిం హక్కులను కాలరాచే బిల్లుపై చర్చకు ఎనిమిది గంటల సమయం సరి పోదు పది గంటలు కావాలని విపక్షాలు పట్టు పట్టాయి.   సమావేశం నుంచి వాకౌట్‌ చేశాయి. అయితే, స్పీకర్ అనుమతిస్తే పది గంటల చర్చకు అయినా పభుత్వం సిద్డంగా ఉందని మంత్రి  కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. సో.. ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు అవసరం అయితే ఇంకా ఎక్కువ సమయం అయినా చర్చ జరగవచ్చును. అయితే  ఎన్ని గంటలు చర్చ జరుగుతుందిఅనేది కాదు, చివరకు ఏమి జరుగుతుంది? ఇదే ఇప్పడు అందరి ముందున్న ప్రశ్న.

వక్ఫ్ చట్ట  సవరణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందుతుంది. అనుమానం లేదు. ఉభసభల్లో అధికార, విపక్షాల సంఖ్య, బలాలను బట్టి చూస్తే వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడం కేవలం లాంఛనం మాత్రమే. 543 మంది సభ్యుల లోక్‌సభలో ప్రస్తుతం 542 మంది ఎంపీలు ఉండగా, ఎన్‌డీఏకి 293 మంది, ఇండీ కూటమికి 238 మంది ఉన్నారు.  వైసీపీ, ఎంఐఎం సహా ఇతర పార్టీలకు 11 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులు ఉండగా.. 9 ఖాళీల కారణంగా 236 మందే ఉన్నారు. వీరిలో ఎన్‌డీఏ ఎంపీలు 125 మంది కాగా.. ఇండీ కూటమికి 88 మంది, వైసీపీ, బీజేడీ, బీఆర్‌ఎస్‌ సహా ఇతరులకు 23 మంది సభ్యులున్నారు. స్వతంత్రుల మద్దతు కూడగట్టేందుకు కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. సో , సంఖ్యా పరంగా చూస్తే వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడం కేవలం లాంఛనం మాత్రమే. అలాగే  ఒక సారి, సభ ఆమోదం పొందిన తర్వాత  రాష్ట్రపతి ఆమోదంతో వక్ఫ్‌ సవరణ బిల్లు వక్ఫ్‌ సవరణ చట్టం అవుతుంది. ఇంతవరకు ఎలాంటి రోడ్ బ్లాక్స్  లేకుండా కథ నడిచి పోతుంది. 

కానీ, అక్కడితో కథ ముగిసి పోదు. అసలు కథ అప్పుడే మొదలవుతుంది. నిజానికి, రేపటి దృశ్యం ఎలా ఉండబోతోందో సూచించే సంకేతాలు ఇప్పటికే చాలా వరకు స్పష్ట మయ్యాయి. ముఖ్యంగా లోక్ సభ ఎన్నికల తర్వాత కలహాల కాపురంగా మారిన ఇండియా కూటమి  ని వక్ఫ్ బిల్లు మళ్ళీ ఏకం చేసింది. బుధవారం(ఏప్రిల్ 2) లోక్ సభలో జరిగే చర్చలో ఇండియా కూటమి పార్టీలు ఒక్కటిగా బిల్లును వ్యతిరేకించాలనే నిర్ణయానికి వచ్చాయి. అయితే  ఇప్పటికి కూడా అటు అధికార ఎన్డీఎ కూటమిలోని భాగస్వామ్య పార్టీలలో ఎలాగైతే చిన్న పెద్ద  సందేహాలు, సందిగ్ధతలు ఉన్నాయో  అలాగే ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలలోనూ శషబిషలు, సందేహాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో సభలో అటు ఎన్డీఎ భాగస్వామ్య పార్టీలు, ఇటు ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల వైఖరి ఎలా ఉంటుంది  అనేది  ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు  ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో   ఒకటే మాట, ఒకటే బాణం  అన్నట్లు వ్యవహరిస్తాయా.. సభలోనూ పాత గాయాలు బయట పడతాయా అన్నది చూడవలసి వుంది. అంతకంటే ముఖ్యంగా ఫ్లోర్ మేనేజిమెంట్,  ఫైనల్ కౌంటింగ్ రేపటి రాజకీయాలను ప్రభావితం చేస్తుందనీ..  కీలకంగా మారుతుందని అంటున్నారు.   

నిజానికి, వక్ఫ్ చట్టం సవరణలకు సంబంధించి సామాన్య ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. అలాగని సానుకూలతా లేదు. అసలు సరైన అవగాహనే లేదు. అయితే  ముస్లిం సమాజంలో సహజంగా స్థిరపడిన బీజేపీ,ఆర్ఎస్ఎస్ వ్యతిరేకత మరీ ముఖ్యంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పట్ల నాటుకు పోయిన వ్యతిరేకత (కల్పిత ‘భయం’ అనాలేమో) కారణంగా మెజారిటీ ముస్లింలు బిల్లును వ్యతిరేకిస్తున్నారు. కానీ  80 శాతం ఉన్న హిందువులపై ఈ బిల్లు రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది ఇప్పటికీ ప్రశ్నార్ధకంగానే ఉందని అంటున్నారు. నిజానికి బిల్లుకు ముందు కాదు  తర్వాతనే అసలు రాజకీయం బయట పడుతుంది.అందుకే వక్ఫ్ సవరణ బిల్లుపై ఈరోజు దేశంలో ఒక విధమైన ఉత్కంఠ నెలకొందని  విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.