రాజారెడ్డి రాజ్యాంగం... వైఎస్ ఫ్యామిలీ రాజకీయం
posted on Apr 2, 2025 10:27AM

వైఎస్ షర్మిల.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా, జగన్ సోదరిగా రాజకీయంగా బాగా పాపులర్ అయ్యారు. పదవుల కంటే పాదయాత్రలతో పాపులర్ అయిన వైఎస్ కుమార్తెకు రాజకీయంగా ఇప్పటి వరకూ ఒరిగిందేమీ లేదు. ఎన్నికల సమయంలో చెల్లి సేవలను వాడుకున్న జగన్ అధికారంలోకి రాగానే ఆమెను కూరలో కరివేపాకులా పక్కన పెట్టేశారు. దాంతో షర్మిల వైఎస్ఆర్‌టీపీ అంటూ తెలంగాణలో పార్టీ పెట్టి సుదీర్ఘకాలం పాదయాత్రలు చేశారు. అయితే సక్సెస్ మాత్రం కాలేకపోయారు. దాంతో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అది జరిగిన వారంలోనే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఏపీలో కాంగ్రెస్ పునరుజ్జీవం బాధ్యతలను షర్మిల భుజాలపై పెట్టి పీసీసీ ప్రెసిడెంట్‌ని చేశారు. ఆ పదవి కట్టబెట్టక ముందు నుంచే షర్మిలకు కాంగ్రెస్ మార్కు రాజకీయం ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది. ఆమెను పీసీసీ ప్రెసిడెంట్ చేయవద్దని ముందు నుంచే అడ్డం పడే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్. అయితే ఆ మాజీ ఎంపీ విన్నపాన్ని కాంగ్రెస్ హైకమాండ్ లైట్ తీసుకుంది. ఆ క్రమంలో హర్షకుమార్ కాంగ్రెస్‌కు రిజైన్ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. మరెక్కడా ఓపెనింగ్స్ లేవేమో ఆ సీనియర్ నేత కాంగ్రెస్ చూరే పట్టుకుని వేలాడుతున్నారు.
వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించవద్దని హైకమాండ్‌ను కోరిన హర్హకుమార్, ఆమెకు కావాలంటే జాతీయ స్థాయి పదవి ఇవ్వండని ఉచిత సలహా కూడా ఇచ్చారు. తెలంగాణ బిడ్డ అని చెప్పుకుని తిరిగిన షర్మిల.. ఆంధ్రప్రదేశ్‌లో ఎలా చెల్లుబాటు అవుతుందని హర్షకుమార్ ప్రశ్నించారు. జగన్, షర్మిల ఇద్దరు ఒకటేనని ఎద్దేవా చేశారు. పెళ్లి కార్డు ఇచ్చేందుకు వెళ్లి షర్మిల తన అన్నతో అరగంటసేపు మంతనాలు జరపాల్సిన అవసరం ఏమోచ్చిందని కొత్తకొత్త డౌట్లు కూడా అప్పట్లో రెయిజ్ చేశారు. జగన్‌కు మోడీతో, షర్మిలకు సోనియాతో లింకు పెట్టేసి కేంద్రంలో రేపు ఏ ప్రభుత్వం వచ్చినా, తాము సేఫ్‌గా ఉండాలనేది జగన్, షర్మిల ఉద్దేశమని మండిపడ్డారు హర్ష కుమార్.అలాంటి హర్షకుమార్ చాపక్రింద నీరులా తాడేపల్లి కోటరీతో చేతులు కలిపారా అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. తనను టార్గెట్ చేస్తున్న షర్మిలకు చెక్ పెట్టడంతో పాటు కూటమి సర్కారును ఇబ్బందుల్లో పెట్టడానికి జగన్ టీమ్ హర్షకుమార్ దళిత కార్డుని వాడుకోవడానికి స్కెచ్ గీస్తోందంట.
కాంగ్రెస్ రక్తాన్ని వంటబట్టించుకున్న వైఎస్ ఫ్యామిలీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపిస్తున్నదన్న ఆరోపణలున్నాయి. తమ రాజకీయ అవసరాల కోసం ఇంటాబయటా ఎవర్నైనా టార్గెట్ చేస్తారన్న టాక్ ఉంది. 1989లో వంగవీటి రంగా హత్య కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి దోహదపడింది. సీఎంను మార్చడానికి 1990లో హైదరాబాద్ మత కలహాలూ ఆ పార్టీ సృష్టేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక 1999లో వరుసగా రెండో సారి ఓడిపోగానే చెన్నారెడ్డి తెలంగాణా అంటూ విభజన రాగం ఎత్తుకుని హడావుడి చేశారు. 2009లో వైఎస్ మరణం తర్వాత తన తండ్రిని రిలయన్స్ వాళ్ళు చంపారని జగన్ అల్లర్లు సృష్టించారు. అదే జగన్ తాను అధికారంలో ఉన్నప్పుడు ముఖేష్ అంబానీకి తన తాడేపల్లి ప్యాలెస్‌లో రాజమర్యాదలు చేశారు. వైసీపీ కోటాలో అంబానీ టీమ్ మెంబర్‌కి రాజ్యసభ సభ్యత్వం కూడా కట్టబెట్టారు.
2015లో అప్పటి కూటమి సర్కారుని బదనాం చేయడానికి తుని ట్రైన్ తగల బెట్టించడానికి ముద్రగడను ముందు పెట్టి పావులు కదిపింది వైసీపీనే అన్న విమర్శలున్నాయి. ఇక అధికారంలోకి రావడానికి 2018లో కోడి కత్తి డ్రామా, 2019 ఎన్నికల ముందు సొంత బాబాయ్‌పై గొడ్డలి వేటు, అధికారంలోకి రాగానే మూడు రాజధానుల చిచ్చు, మొన్న ఎన్నికల ముందు పేదలు వర్సెస్ పెత్తందార్లు అంటూ నాటకం.. తాజాగా పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని అడ్డంపెట్టుకుని రాజకీయం జగన్ పొలిటికల్ డ్రామాలకు పరాకాష్టగా నిలుస్తున్నాయి.
ఎవరు అవునన్నా కాదన్నా కులం.. మతం.. ప్రాంతాలను అడ్డు పెట్టుకుని, శవ రాజకీయాలు చేస్తూ ఆ పునాదుల పైనే, వైఎస్ ఫ్యామిలీ ఎదిగిందంటారు. అప్పుడు అయ్యా.. ఇప్పుడు కొడుకు.. తమ రాజకీయ ఎదుగుదల కోసం రాజారెడ్డి రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారనేది కాదనలేని వాస్తవం. ఇన్ని ఘటనలు కళ్ళ ముందు జరుగుతూ, రాష్ట్రం నష్టపోతున్నా, తెలుగుదేశం మీద ద్వేషంతోనో, కులం, మతం, ప్రాంతం మీద ఉండే ఉన్మాద అభిమానంతోనో, వాళ్ళని ఇంకా నమ్మే వాళ్ళు ఉండటం ఈ తెలుగు జాతి దౌర్భాగ్యమనే చెప్పాలి. లేకపోతే హైదరాబాద్ టూ బెజవాడ, రాజమండ్రి టూ వీలర్ ప్రయాణం చేస్తూ దురదృష్టవశాత్తు మరణించిన పాస్టర్ ప్రవీణ్ మృతిని కూడా రాజకీయం చేయడం ఏంటి?