న్యాయవ్యవస్థలను ప్రజా ప్రతినిధులే అనుమానించి, అవమానిస్తే...
posted on Aug 5, 2015 1:01PM
.jpg)
హైకోర్టు విభజనపై తెరాస ఎంపీ వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలు మన న్యాయవ్యవస్థలనే ప్రశ్నిస్తున్నట్లుంది. హైకోర్టు విభజనపై ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పునే అయన తప్పు పట్టారు. హైకోర్టు తన పరిధిని అతిక్రమించి తీర్పు ఇచ్చిందని ఆయన అన్నారు. విభజన చట్టంలో సెక్షన్:31 ప్రకారం రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు ఉండాలని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, హైకోర్టు మాత్రం అందుకు విరుద్దంగా తీర్పు చెప్పిందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఉన్న ఉమ్మడి హైకోర్టును విభజించి హైదరాబాద్ లో తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వేరేగా హైకోర్టు ఏర్పాటు చేయదలచుకొంటే హైకోర్టుకి ఎందుకు అభ్యంతరం? అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ, సచివాలయం, ముఖ్యమంత్రుల కార్యాలయాలు వగైరా అన్నిటినీ విభజించుకొన్నప్పుడు హైకోర్టుని విభజించడానికి ఎందుకు అభ్యంతరం చెప్పాలి? అని ఆయన ప్రశ్నించారు.
సుప్రీం కోర్టులో కొందరు న్యాయమూర్తులకు తీర్పులు వ్రాయడం కూడా చేతకాదని నేషనల్ జ్యూడిషియల్ కమీషన్ విచారణ సందర్భంగా కొందరు న్యాయవాదులు వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చని వినోద్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యాయపాలనపై తన పట్టుకోల్పోకూడదనే ఆలోచనతో ఉద్దేశ్యపూర్వకంగానే హైకోర్టు విభజన జరగకుండా జాప్యం చేస్తున్నారని వినోద్ ఆరోపించారు.
కానీ వినోద్ చేసిన ఈ ఆరోపణలన్నీ మన న్యాయవ్యవస్థను అనుమానిస్తున్నట్లుగా, అవమానిస్తున్నట్లుగా ఉన్నాయని చెప్పకతప్పదు. జ్యూడిషియల్ కమీషన్ పేరు చెప్పి న్యాయమూర్తులకు తీర్పు ప్రతిని వ్రాయడం కూడా రాదని చెప్పడం మన న్యాయవ్యవస్థలను, న్యాయమూర్తులను అవమానించడమే. హైకోర్టు విభజనపై ఉమ్మడి హైకోర్టు తీర్పుని ప్రశ్నించడం కూడా అటువంటి చర్యేనని చెప్పక తప్పదు.
హైకోర్టులు, సుప్రీంకోర్టు మన చట్టాలలో రాజ్యాంగంలో ఉన్న నియమ నిబంధనలకి అనుగుణంగా మాత్రమే తీర్పులు చెపుతాయి తప్ప కులం, మతం, జాతి, ప్రాంతీయవాదం, భావోద్వేగాలు వంటి అంశాలకు లోబడి పనిచేయవు. అవి చట్టాలకు, రాజ్యాంగానికి భాష్యం చెప్పే హక్కు కలిగి ఉన్నాయి. అదేవిధంగా వాటిని పరిరక్షించే బాధ్యత కూడా కలిగి ఉన్నాయి.
విభజన చట్టంలో సెక్షన్: 31లో రెండు రాష్ట్రాలకు హైకోర్టులు ఉండాలని వ్రాసున్న మాట నిజమే. ఒకవేళ వ్రాయకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన హైకోర్టుని ఏర్పాటు చేసుకోక తప్పదు. కానీ ఆ చట్టం ప్రకారం ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే హైకోర్టు ఏర్పాటు చేయాలని ఉంది కానీ ప్రస్తుతం ఉన్న ఉమ్మడి హైకోర్టుని విభజించి తెలంగాణా రాష్ట్రంలో రెండు హైకోర్టులను ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొనబడలేదు. అటువంటప్పుడు హైకోర్టు ఏర్పాటుకి తెలంగాణా ప్రభుత్వం హైదరాబాద్ లో బిల్డింగ్స్ కేటాయించినంత మాత్రాన్న హైకోర్టు విభజించి మరొకటి ఏర్పాటు చేస్తే అది చట్టాన్ని ఉల్లంఘించినట్లే అవుతుంది. అందుకే హైకోర్టు విభజన చేసి హైదరాబాద్ లో మరో హైకోర్టు ఏర్పాటు సాధ్యం కాదని తీర్పు చెప్పింది. అది నూటికి నూరు శాతం చాలా ఖచ్చితమయిన తీర్పు. అందుకే సుప్రీంకోర్టు ఆ తీర్పుని కొట్టివేయలేకపోయింది. ఈ సాంకేతిక అవరోధం కారణంగానే కేంద్రప్రభుత్వం కూడా అడుగు ముందుకు వేయలేకపోయింది.
ఇవన్నీ తెరాస ఎంపీ వినోద్ కుమార్ కి తెలియవని భావించలేము. అయినప్పటికీ ఆయన సెక్షన్: 31కి స్వంత భాష్యాలు చెపుతూ హైకోర్టు తీర్పునే ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు విభజనపై ఉమ్మడి హైకోర్టు తన తీర్పు చెపుతున్న సమయంలో ఒక మంచి సూచన కూడా చేసింది. కానీ దానిని ఆయన పట్టించుకోలేదు. విభజన చట్టంలోని సెక్షన్: 31కి పార్లమెంటులో చట్ట సవరణలు చేసినట్లయితే, ఉమ్మడి హైకోర్టుని విభజించి హైదరాబాద్ లో తెలంగాణాకు లేదా ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేసుకోవచ్చని ఆనాడే చెప్పింది. కానీ చట్ట సవరణ చేయడం కష్టమని భావించడం వలననో లేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఈ కారణంతో విమర్శించవచ్చనే ఆలోచనతోనో తెరాస ప్రభుత్వం చట్ట సవరణకు ఒత్తిడి చేయడం లేదు. పైగా న్యాయవ్యవస్థలపై చంద్రబాబు నాయుడు తన పట్టు కోల్పోకూడదనే ఉద్దేశ్యంతోనే విభజన జరగకుండా అడ్డుపడుతున్నారనే మరొక భయంకరమయిన ఆరోపణ చేసి, న్యాయవ్యవస్థలు రాజకీయ నేతల, ప్రభుత్వాల కనుసైగలలోనే పనిచేస్తుంటాయనే అపవాదు కూడా మోపారు.
న్యాయవ్యవస్థల మీద ప్రజా ప్రతినిధులే ఇంత నీచమయిన అభిప్రాయం కలిగి ఉంటే ఇక సామాన్య ప్రజలకి వాటిపై విశ్వాసం కలిగిఉంటారా? ప్రభుత్వ వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు అన్నీ తమకు అనుకూలంగా వ్యవహరిస్తేనే వాటిని మన్నిస్తాము లేకుంటే ప్రశ్నిస్తాము? అనే ఇటువంటి ధోరణి మంచి పద్ధతి కాదు.