ఆ ఇద్దరు హైదరాబాద్ వాసులు క్షేమంగా ఉన్నారు

 

చేతికి చిక్కిన మనుషులను కోళ్ళు, మేకలను కోసినట్లు కోసి చంపే ఐ.యస్.ఐ.యస్. (ఐసిస్) ఉగ్రవాదుల చేతిలో నుండి క్షేమంగా బయటపడిన కర్నాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్ కుమార్ ఇద్దరూ కూడా మృత్యుంజయులేనని చెప్పక తప్పదు. వారిరువురూ ఈ రోజు హైదరాబాద్ విమానాశ్రయం చేరుకొన్నారు. ఇంకా ఐసిస్ ఉగ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్న ఇద్దరు హైదరాబాద్ వాసులు గోపీ కృష్ణ, బలరామ్ కూడా క్షేమంగా ఉన్నారని, వారు ఉపాద్యాయులని తెలియడంతో ఐసిస్ ఉగ్రవాదులు తమని చాలా మర్యాదగా చూసుకొన్నారని, తాము హైదరబాద్ చేరుకోగానే ఆ విషయం ఫోన్ ద్వారా వారికి తెలియజేయగానే మిగిలిన ఇద్దరినీ కూడా క్షేమంగా విడుదల చేస్తామని వారు హామీ ఇచ్చినట్లు తెలిపారు. వారిరువురూ చెప్పిన ఈ చల్లటి వార్త విని బలరాం, గోపీకృష్ణ కుటుంబ సభ్యులు కొంత ఉపశమనం పొందారు.

 

తమని పొరపాటున కిడ్నాప్ చేసినట్లు ఐసిస్ ఉగ్రవాదుల నాయకుడే తమకు చెప్పాడని, కనుక వారికి ఎటువంటి హానీ తలపెట్టబోమని హామీ ఇచ్చినట్లు వారిరువురూ తెలిపారు. బహుశః మరికొన్ని గంటలలోనే ఐసిస్ ఉగ్రవాదులు మిగిలిన ఇద్దరు బందీలని విడిచిపెట్టే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. తమను కిడ్నాప్ చేసిన ఐసిస్ ఉగ్రవాదులు అందరూ 16-18ఏళ్ల లోపు వయసున్నవారేనని వారు తెలిపారు. ఐసిస్ ఉగ్రవాదులకు ఉపాద్యాయుల పట్ల గౌరవం ఉండటం వారి చేతిలో బందీలుగా చిక్కి బయటపడిన వారి అదృష్టమేనని చెప్పక తప్పదు. ఈ రోజు రాత్రికయినా మిగిలిన ఇద్దరు ఉపాద్యాయులను కూడా వారు విడిచిపెడితే చాలని అందరూ భగవంతుడిని ప్రార్ధిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu