తెలుగు రాష్ట్రాల కాబోయే గవర్నర్ ను… విజయసాయి కలిశారా?

 

మాస్ ఫాలోయింగ్ వున్న రాజకీయ నాయకులు పాలిటిక్స్ ని ఫుట్ బాల్ గా ఆవేశంగా ఆడతారు! కాని, ప్రతీ పార్టీలోనూ కొందరు క్లాస్ నాయకులు తమదైన రీతిలో చదరంగంలా ఆడతారు! వర్కవుట్ అయినా కాకపోయినా తెలివిగా ఎత్తులు వేసే ప్రయత్నం చేస్తుంటారు! వైసీపీలో అలాంటి నేత విజయసాయి రెడ్డి! చార్టెడ్ అకౌంటెంట్ అయిన ఆయన రాజకీయంలో కూడా లాభ, నష్టాలు బేరీజు వేసుకుని వ్యూహాలు పన్నుతుంటారు. ఈ మధ్య జాతీయ స్థాయిలో అలాంటి అడుగులు మరింత ఎక్కువయ్యాయి!

 

విజయసాయి రెడ్డి పేరు ఒకప్పుడు ఎవరికీ తెలియదు. కాని, తరువాత కాలంలో ఆయన వైఎస్ కుటుంబానికి ఆప్తుడుగా బయటకొచ్చారు. మరీ ముఖ్యంగా, జగన్ జైలుకి వెళ్లిన క్రమంలో ఆయన సీఏగా అందరికీ పరిచయం అయ్యారు. జగన్ పై ఆరోపణల్లో ఆయన కూడా జైలుకి వెళ్లాల్సి వచ్చింది. అయితే, గత కొన్ని రోజులుగా విజయసాయి రెడ్డి వైసీపీలో యమ యాక్టివ్ అయిపోయారు. ఫ్యాన్ పార్టీలోని తలపండిన రాజకీయ నేతలంతా ఇప్పుడు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. విజయసాయి చక్రం తిప్పుతున్నారు!

 

జగన్ కు ఎంతో కీలకమైన దిల్లీ ప్రభుత్వ అభయ హస్తం విజయసాయి చలువే అంటున్నారు కొందరు. మోదీని యువ నేత వెళ్లి కలుసుకోవటం, బేషరతుగా రామ్ నాథ్ కోవింద్ కు, వెంకయ్యకు మద్దతు పలకటం… ఇవన్నీ విజయసాయి ప్లాన్ లో భాగమేనంటున్నారు. అందుకు తగ్గట్టే విజయసాయి రామ్ నాథ్ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నిక కాక ముందే ఆయన్ని కలుసుకుని వచ్చారు. ఇక ఇప్పుడు మరో కీలక బీజేపి నేతతో ఆయన సమావేశం కావటం అందరి దృష్టినీ ఆకర్షించింది!

 

గుజరాత్ కు సీఎంగా పని చేసిన ఆనందీబేన్ పటేల్ ను విజయసాయి కలిశారు. పెద్ద విశేషమేం ఏం లేదు… మర్యాద పూర్వకంగా కలిశానని చెప్పారు. కాని, ఎక్కడో గుజరాత్ లో వున్న ఆనందీబేన్ ను కలవటం ఎందుకు? విశేషమేం లేదని చెబుతోన్నా అసలు కలవటమే పెద్ద విశేషం! బహుశా ఆనందీబేన్ త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలకీ గవర్నర్ గా నరసింహన్ స్థానంలో రావచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే సేఫ్ గా వుంటుందని విజయసాయి ఆమెని ముందుగానే కలిశారని టాక్!

 

రామ్ నాథ్ రాష్ట్రపతి కాక ముందే ఆయన్ని,ఇప్పుడు ఆనందీబేన్ మన రాష్ట్రాలు రెండింటికీ గవర్నర్ కాక ముందే ఆమెని… కలవటం వల్ల విజయసాయికి, వైసీపీకి ఏంటి లాభం? ఈ విషయం ఇప్పుడే చెప్పలేం! కాని, వ్యాపార సూత్రాలు బాగా తెలిసిన విజయసాయి రెడ్డి ఏ లాభం ఆశించకుండా కలిసుంటారని కూడా సరిపెట్టుకోలేం! మరీ ముఖ్యంగా, టీడీపీ వారు, చంద్రబాబు నాయుడు ఈ పరిణామంపై తగినంత దృష్టి పెట్టాలి. అప్పుడే వ్యూహాన్ని ధీటుగా ఎదుర్కోవటం సాధ్యమవుతుంది…