మోదీ వేట… నితీష్ వేటు… లాలూ టేన్షన్ గా వెయిటింగ్!

 

లాల్ ప్రసాద్ యాదవ్ టైం బ్యాడ్ గా నడుస్తోంది. ఇందులో ఎవరికీ సందేహం లేదు. కాని, టైం ఎంత బ్యాడ్ అయినా తనదైన రీతిలో సంక్షోభం నుంచీ బయటపడే మార్గాలు కూడా ఆయన బాగానే అన్వేషిస్తుంటారు. అవసరమైతే తనకు బద్ధ శ్రతువులైన వార్ని కూడా ఆలింగనం చేసుకుని గండం నుంచి గట్టెక్కుతారు. ఒకప్పుడు అలాగే కాంగ్రెస్ ను తిట్టిపోశాడు. మళ్లీ ఆ పార్టీతో కలిశాడు. తరువాత ఉప్పు నిప్పులా వున్న నితీష్ కుమార్ తోనూ లాలూ హ్యాపీగా కలిసిపోయారు. బీజేపిని అధికారానికి దూరం చేసి బీహీర్ ని స్వంతం చేసుకున్నాడు. కాని, ఇప్పుడు మరోసారి లాలూకి అగ్నీ పరీక్ష ఎదురవుతోంది…

 

లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం మీద ఏక కాలంలో అనేక దాడులు జరుగుతున్నాయి. ఒకవైపు ఆయన కూతురు అక్రమ ఆస్తుల మీద దాడులు జరుగుతుండగానే మరోవైపు కొడుకుని కూడా టార్గెట్ చేశాయి కేంద్ర దర్యాప్తు సంస్థలు. ఇలా ఉక్కిరిబిక్కరి అవుతోన్న లాలూ ఒత్తిడిలోనూ మాస్టర్ ప్లాన్ మాత్రం వేయటం మానలేదు. తనని ఎలాగైనా వదిలించుకుని వెళ్లాలని చూస్తోన్న నితీష్ కుమార్ కి గుణపాఠం చె్ప్పేలా మరో కూటమికి తెర తీస్తున్నాడు! అందుకోసం దళిత నాయకురాలు మాయవతి, గిరిజన నాయకుడు మాన్జీలని ముగ్గులోకి దింపుతున్నాడు. పనిలో పనిగా గడ్డు కాలం ఎదుర్కొంటోన్న సమాజ్ వాదిని పార్టీని కూడా ఆయన వాడుకోవాలని ట్రై చేస్తున్నాడు!

 

జేడీయూ నాయకుడు నితీష్… లాలూ కుటుంబంపై వస్తోన్న అవినీతి ఆరోపణల్ని చూపి ఆర్జేడీని .ప్రభుత్వం నుంచి తొలగిస్తే… బీజేపీ మద్దతుతో మళ్లీ అధికారంలో వుండొచ్చని భావిస్తున్నాడు. కాని, ఒక్కోసారి అంచనాలు తలక్రిందులై ప్రభుత్వం కూలిపోతే మధ్యంతర ఎన్నికలొస్తాయి! అప్పుడు తన ఆర్జేడీకి మద్దతుగా మాయావతి బీఎస్పీని, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితిన్ సింగ్ మాన్జీ హిందూస్థాన్ అవామ్ మోర్చా ( హెచ్ఏఎం ) ను సిద్దం చేసుకోవాలని లాలూ వ్యూహం పన్నుతున్నాడు. అందుకే, మాయావతి రాజ్యసభ నుంచి రాజీనామా చేయగానే తమ పార్టీ తరుఫున ఆమెను పెద్దల సభకి పంపుతామని ప్రకటించాడు లాలూ. అంతే కాదు, ఉత్తర్ ప్రదేశ్ లో కూడా పుల్ పుర్ నియోజక వర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో మాయావతిని పోటి చేయించి గెలిపించుకుందామని సమాజ్ వాదికి చెబుతున్నాడు. అటు గిరిజన నేత అయిన మాన్జీని కూడా తమతో కలుపుకుని నెక్స్ట్ ఎలక్షన్స్ కి వెళ్లాలని లాలూ ప్లాన్. అలా అయితే, ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఓట్లన్నీ నితీష్ కు వెళ్లకుండా చూడొచ్చని ఆయన ఆలోచన!

 

ఎస్సీని, బీఎస్పీని, మాన్జీ పార్టీని, చివరకు కాంగ్రెస్ ను కలుపుకుంటూ పోవాలని లాలూ చేస్తోన్న యోచన అద్బుతమైందే! కాని, అలాంటిది సాధ్యపడటం చివరిదాకా కష్టమే! ఏ పార్టీ హ్యాండిచ్చినా లాలూ చేయాలనుకున్న ఆలూ ఫ్రై మాడిపోయే అవకాశముంది! మరో వైపు జనంలో మంచి పేరున్న నితీష్, ఫుల్ ఊపు మీదున్న మోదీ… ఇద్దరూ లేకుండా మాయావతి, ములాయం, రాహుల్ గాంధీ.. వీళ్లతో కలిసి లాలూ సంచలనాలు సృష్టిస్తాడా? డౌటే!