సినీ సెలబ్రిటీల చర్యలు, కామెంట్సే డ్రగ్స్ కేసులో గందరగోళానికి కారణమా

డ్రగ్స్ కేస్ విచారణ… ఏ ఛానల్ లోకి ట్యూన్ అయినా, ఏ పేపర్ తిరగేసినా ఇప్పుడు ఇదే వార్త! అసలు ఇంతగా కలకలం ఎందుకు రేగుతోంది? సినిమా యాంగిల్ వుండటమే! పూరీ నుంచి ఛార్మీ దాకా పెద్ద పెద్ద సినీ సెలబ్రిటీలు డ్రగ్స్ ఉచ్చులో ఇరుక్కున్నారు. ఇప్పుడే వారంతా దోషులని, కాదనీ ఏమీ చెప్పలేం. కాని, సామాన్య జనానికి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆత్రుత వుంటుంది. అందుకే, మీడియా తెలిసింది, తెలియంది అంతా కలిపి కలగాపులగం చేసే వండి వడ్డిస్తోంది. అయితే, ఇదే క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న సినిమా వారు కూడా రచ్చని మరింత పెద్దది చేసేలా వ్యవహరిస్తున్నారు. బహుశా ఇది కూడా ఓ వ్యూహమేనేమో అనుకుంటున్నారు సామాన్యులు!

 

రేపు విచారణకు అటెండ్ అవ్వాల్సిన ఛార్మి కోర్టు తలుపు తట్టింది. ఆమె పిటీషన్ ఆగమేఘాల మీద విచారించిన న్యాయస్థానం తను అడిగిన ప్రధానమైన వెసులుబాటు కల్పించలేదు. సిట్ ప్రశ్నలు వేస్తున్నప్పుడు ఛార్మి తరుఫు న్యాయవాది వుండటానికి వీలులేదని తేల్చేసింది. అయితే, ఛార్మి కోరిన విధంగా సాయంత్రం 5గంటల తరువాత విచారణ చేయకూడదనీ, బలవంతంగా బ్లడ్ శాంపిల్స్ తీసుకోకూడదనీ మాత్రం ఆదేశించింది. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఛార్మి మొదటి నుంచీ తాను విచారణకు హాజరుకానని చెప్పలేదు. విచారణకు హాజరవుతాను కాని.. నాకు ఫలానా డౌట్స్, భయాలు వగైరా వగైరా వున్నాయని ఆమె కోర్టుకు చెప్పింది!

 

ఛార్మి కోర్టు ఎపిసోడ్ చూశాక ఎవరికైనా ఒక అనుమానం తప్పక వస్తుంది. ఆమె నిజంగా డ్రగ్స్ కేసులో నిర్దోషి అయితే ఇంత నెర్వస్ నెస్ ఎందుకు? అలాగే, విచారణ ఎదుర్కొన్న పూరీ జగన్నాథ్ కూడా మీడియాని, ఇండస్ట్రీలోని పలుకుబడి గల వార్ని టార్గెట్ చేశాడు. ఆయన కూడా ఇంచుమించూ సిట్ ను తప్పుబట్టినట్టే మాట్లాడాడు. ఇక వర్మ సంగతైతే సరేసరి! ఓ సారి సినిమా వాళ్లలా డ్రగ్స్ తీసుకున్న చిన్న పిల్లల్ని కూడా 12గంటలు విచారించండి అంటాడు. ఇంకోసారి సినిమా వాళ్లని అకున్ సబర్వాల్ టార్గెట్ చేశారంటాడు. ఇక తాజాగా కేసీఆర్, టీఆర్ఎస్, హైద్రాబాద్ ప్రతిష్ఠ మసకబారుతోందని ఫేస్బుక్ లో వాపోయాడు. అసలింకా ఏ సినిమా వాళ్లనీ, ఏ డ్రగ్స్ పెడ్లర్స్ ని కోర్టులో హాజరపరచలేదు, ఎవరికీ శిక్షలు పడలేదు… అప్పుడే కేసీఆర్ పేరు పాడైపోవటం ఏంటి? అసలు వర్మ అంత తీవ్రంగా సిట్ పైన మాటల దాడి చేయాల్సిన అవసరం ఏంటి? ఆయనకే తెలియాలి…

 

భారీగా బ్యాక్ గ్రౌండ్ వున్న టాలీవుడ్ వాళ్ల మీద డ్రగ్స్ కేసు ఎపెక్ట్ పడలేదు. అది అందరూ ఒప్పుకునేదే. కాని, అంత మాత్రం చేత ఎక్సైజ్ శాఖ చేస్తోన్న విచారణే వద్దన్నట్టు, లేదంటే మేము చెప్పినట్టే సాగాలన్నట్టు వర్మ లాంటి వారు మాట్లాడటం గందరగోళం సృష్టించటమే అవుతుంది. అలాగే ఛార్మి కోర్టుకు వెళ్లి తన ప్రధానమైన డిమాండ్ సాధించుకోలేకపోయింది. కాని, జనంలో మాత్రం ఆమె అంతగా భయపడటానికి కారణం ఏంటనే కీలకమైన అనుమానం రేకెత్తింది. కనీసం ముందు ముందు అయినా సినిమా వాళ్లు విచారణను ప్రభావితం చేసేలా చర్యలు, కామెంట్లు చేయకుండా వుంటే గౌరవంగా వుంటుంది. ఎందుకంటే, మన దేశంలో తప్పు చేసిన సామాన్యులకి శిక్షలు పడటమే చాలా కష్టం. అటువంటిది నిజంగా ఏ తప్పూ చేయకుంటే సినిమా సెలబ్రిటీలు నిర్దోషులుగా బయటపడటం పెద్ద కష్టమేం కాదు. అసాధ్యం అంతకన్నా కాదు.