చంద్రబాబు ‘పరిశ్రమ’ మొదలైంది!

అలా ప్రమాణ స్వీకారం చేశారో లేదో ఇలా ఐదు ముఖ్యమైన సంతకాలు చేసిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో పాలన పరుగు ప్రారంభించేలా చేశారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఏర్పాటు చేయబోతున్న రిఫైనరీ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధించేలా అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 50 వేల కోట్లను బీపీసీఎల్ సంస్థ పెట్టుబడిగా పెట్టే అవకాశం వుంది. దీని ద్వారా మరిన్ని పెట్టుబడులు ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్‌కి వచ్చే అవకాశం వుంది. దీనితోపాటు వేలమందికి ఉపాధి కూడా లభించే అవకాశం వుండటంతో చంద్రబాబు ప్రభుత్వం దీన్ని అత్యంత ప్రాధాన్యమైన అంశంగా తీసుకుని, ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. బీపీసీఎల్ అధికారులతో ఈ రెండు రోజుల్లోనే అధికారులు సంప్రదింపులు ప్రారంభించారు. రాష్ట్రంలో రెండు ప్రాంతాలను బీపీసీఎల్ అధికారులకు సూచించారు. ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కడైనా రిఫైనరీ ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టును దక్కించుకోవడానికి ఇప్పటికే గుజరాత్, ఉత్తరప్రదేశ్ ప్రయత్నాలు చేస్తున్నాయి. రిఫైనరీల ఏర్పాటుకు సముద్ర తీర ప్రాంతాలనే అనుకూలమైనవి కాబట్టి, ఉత్తర్ ప్రదేశ్ పెద్దగా పోటీలో వుండే అవకాశం లేదు. ఒక్క గుజరాత్‌కి మించిన ఆఫర్లు ఇవ్వగలిగితే బీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్‌లో రిఫైనరీ ఏర్పాటు చేసే అవకాశం వుంటుంది.