స్టీఫెన్‌సన్ తిక్క కుదిరింది


అందరూ ఊహించినట్టే జరిగింది. టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ తిక్క కుదిరింది.  తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మీద కుట్ర పూరితంగా స్టింగ్ ఆపరేషన్‌ చేయడంలో విజయం సాధించిన స్టీఫెన్‌సన్ ఆ తర్వాత తనను తాను హీరోగా అభివర్ణించుకోవడం ప్రారంభించారు. తాను నీతి, నిజాయితీలకు ప్రతిరూపంలా బిల్డప్ ఇచ్చుకోవడం మొదలుపెట్టారు. ఒక తాత్కాలిక విజయం దక్కగానే అహంకారం తలకు ఎక్కిన ఆయన తనకు ఇక తిరుగు లేదని భావిస్తూ వచ్చారు. అయితే ఆ మత్తు తలకు బాగా ఎక్కిన ఆయనకు, తాను చేయించిన స్టింగ్ ఆపరేషన్‌కి న్యాయస్థానం ముందు విలువ లేదని, తాను చంద్రబాబుతో మాట్లాడినట్టుగా ప్రచారంలో వున్న టేపులకు అంత సీను లేదని అర్థం కాలేదు. అందుకే తానేదో సాధించినట్టు ఫీలైపోతున్నారు. అందుకే, న్యాయమూర్తినే అవమానించే విధంగా ప్రవర్తించి ఇప్పుడు కోర్టు ధిక్కార నేరాన్ని నెత్తి మీదకు తెచ్చుకున్నారు.

ఓటుకు నోటు వ్యవహారంలో ఒక ముద్దాయిలా భావిస్తు్న్న మత్తయ్య దాఖలు చేసుకున్న పిటిషన్‌ని ఫలానా న్యాయమూర్తి విచారించబోతున్నారని, ఆయన మీద తనకు నమ్మకం లేదని, అర్జెంటుగా న్యాయమూర్తిని మార్చేయాలని స్టీఫెన్‌సన్ తలాతోకా లేని పిటిషన్‌ని కోర్టులో దాఖలు చేసినప్పుడే ఇదేదో తోక కత్తిరించుకునే వ్యవహారంలా వుందే అని కాస్తంత పరిజ్ఞానం వున్న అందరూ భావించారు. స్టింగ్ ఆపరేషన్ చేసేంత తెలివితేటలు వున్న స్టీఫెన్‌సన్‌కి ఈ విషయంలో అంత తెలివితేటలు లేకుండా పోయాయి. ఈయనేదో తెలిసీ తెలియక న్యాయమూర్తి మీద నమ్మకం లేదంటూ పిటిషన్ దాఖలు చేస్తే, దానికి తెలంగాణ అడ్వకేట్ జనరల్‌ కూడా వత్తాసు పలికారు. సాక్షాత్తూ  సదరు న్యాయమూర్తి దగ్గరకే వెళ్ళి ఈ కేసు నుంచి తప్పుకోండి అంటూ సూచించారు. నిజంగా ఈ చర్యలను చూస్తుంటే వీళ్ళకు అసలు న్యాయస్థానాల గురించి కొద్దిగా అయినా తెలుసా అనే సందేహం చాలామందికి వచ్చింది. ఇప్పుడు స్టీఫెన్‌సన్ తదితరులు చేసిన ఓవర్ యాక్షన్‌కి సరైన  రియాక్షన్ వచ్చింది. ఓటుకు నోటు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మత్తయ్య క్వాష్‌ పిటిషన్‌ను వేరేబెంచ్‌కు తరలించాలన్న స్టీఫెన్‌సన్‌ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. స్టీఫెన్‌సన్‌ తప్పుడు అఫిడవిట్‌ ఇచ్చి కోర్టును తప్పుదోవ పట్టించారంటూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీఫెన్‌సన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కోల్పోయే విధంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇలాంటి తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన స్టీఫెన్‌సన్‌ మీద కోర్టు ధిక్కారణ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. తిక్క కుదరడం అంటే ఇదే.