తెలంగాణా పోలీస్ వాహనాల కొనుగోలులో కుంభకోణం?

 

కేసీఆర్ తెలంగాణా ముఖ్యమంత్రిగా అధికారం చేప్పట్టిన తరువాత చిన్న పిల్లలకు బొమ్మకార్లు కొనిపెట్టినట్లుగా హైదరాబాద్ లో పోలీసులకు కొన్ని వందల ఇన్నోవా కార్లు, హీరో మోటార్ సైకిల్స్ కొనిపెట్టేయడంతో పోలీసులే కాదు ప్రజలు కూడా చాలా సంతోషపడ్డారు. కమీషన్లకి కక్కుర్తిపడే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసిన ప్రజలు మళ్ళీ ఇన్నాళ్ళకి మెరుపువేగంతో పనిచేసే ప్రభుత్వం వచ్చినందుకు చాలా సంతోషపడ్డారు. ఇంతకు ముందు డొక్కుజీపులు వేసుకొని తిరిగే పోలీసులు ఇప్పుడు ఇన్నోవా కార్లలో వస్తుంటే మన పోలీసులకి కూడా ఇప్పుడు “ఫారిన్ కంట్రీ పోలీస్ లుక్” వచ్చేసిందని ప్రజలు చాలా సంబరపడ్డారు. కానీ ఒక ప్రముఖ జాతీయ ఛానల్ ఈ వాహనాల కొనుగోలు వెనుక పెద్ద కుంభకోణం జరిగిందని శనివారం బయటపెట్టింది.

 

కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుమారుడు హర్షవర్ధన్ నాయుడుకి టయోటా కార్ల డీలర్ షిప్, అదేవిధంగా కేసీఆర్ కుమారుడు కే.టి.ఆర్. కి హీరో హోండా మోటార్ సైకిల్స్ డీలర్ షిప్ ఉందని వారిరువురికి లబ్ది చేకూర్చేందుకే తెలంగాణా ప్రభుత్వం ఎటువంటి టెండర్లు పిలవకుండా రూ.271 కోట్లు వ్యయం చేసి ఒకేసారి 3,883 ఇన్నోవా కార్లు, 2000 హీరో హోండా మోటార్ సైకిల్స్ కొందని సదరు న్యూస్ ఛానల్ బయటపెట్టింది. వెంకయ్యనాయుడు కుమారుడు హర్షవర్ధన్ నాయుడికి టయోటా కార్ల డీలర్ షిప్ ఉన్న మాట వాస్తవమే. కానీ మంత్రి కే.టి.ఆర్. తనకు హీరో హోండా మోటార్ సైకిల్స్ డీలర్ షిప్ ఉందన్న వార్తలను, దానికి తమ ప్రభుత్వం లబ్ది చేకూర్చిందన్న సదరు న్యూస్ ఛానల్ చేసిన ఆరోపణలను ఖండించారు. అది పూర్తి నిరాధారమయిన ఆరోపణలని ఆయన అన్నారు.

 

ఇక ఈ విషయంపై తెలంగాణా డి.జి.పి. అనురాగ్ శర్మ స్పందిస్తూ, “నిజానికి తెలంగాణా ప్రభుత్వం కార్లు, మోటార్ సైకిల్స్ అన్నిటికి కలిపి కేవలం రూ. 206 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. భారత ప్రభుత్వం ఇచ్చిన డి.జి. మరియు డి. రేట్ కాంట్రాక్ట్ మార్గదర్శకాలు, నిర్ణయించిన ధరల ప్రకారం ఆ వాహనాలను నేరుగా ఉత్పత్తిదారుల నుండి కొన్నిటిని, మరి కొన్నిటిని వారి అధీకృత డీలర్స్ వద్ద నుండి తెలంగాణా ప్రభుత్వం కొనుగోలు చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, నిర్ణయించిన నిర్దిష్ట ధరల ప్రకారం ఆ వాహనాలను ఓపెన్ టెండర్ విధానంలో ఈ-ప్రోక్యూర్ మెంట్ పద్దతిలో కొనడం జరిగింది. కనుక టెండర్లు పిలవలేదనే ఆరోపణలు అవాస్తవం,” అని అన్నారు.

 

తెలంగాణా రాష్ట్ర ఐ.జి. సంజయ్ కుమార్ జైన్ మీడియాలో వస్తున్న ఈ ఆరోపణలపై స్పందిస్తూ, “తెలంగాణా ప్రభుత్వం 3,883 ఇన్నోవా కార్లు కొందన్న వార్తలు పూర్తిగా అవాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 696 ఇన్నోవా వాహనాలను మాత్రమే కొంది. అవి కాకుండా టాటా, మహేంద్ర తదితర కంపెనీలకు చెందిన మరికొన్ని వాహనాలను ఈ-ప్రోక్యూర్ మెంట్ విధానంలో కొంది. ఇటువంటి అవాస్తవాలను ప్రసారం చేసినందుకు సదరు న్యూస్ ఛానల్ పై పోలీసు శాఖ పరువునష్టం దావా వేయాబోతోంది,” అని తెలిపారు.