ఈ సస్పెన్స్ సినిమా ఏంటి పవనబ్బాయ్?
posted on Jun 29, 2015 1:28PM
పవన్ కళ్యాణ్ మొత్తానికి సినిమావాడనిపించాడు. తన స్టేట్‌మెంట్లని కూడా సస్సెన్స్ భరితంగా బయటపెడుతూ జనాలకి లేనిపోని ఉత్కంఠను పెంచుతున్నాడు. అప్పుడెప్పుడో అయ్యగార్ని రాజధాని భూముల విషయంలో కామెంట్లు చేసినప్పుడు చూశాం. ఆ తర్వాత ఆయనని రాజకీయంగా బయట ఎక్కడా చూసిన గుర్తు లేదు. అయితే మనిషి బయట కనిపించకపోయినా, అయినదానికీ కానిదానికీ ఆ ట్విట్టర్ ఒకటి వుంది కదా.. అందులో కనిపిస్తున్నాడు. రెండ్రోజుల క్రితం ట్విట్లర్లో జనాన్ని పలకరించిన ఆయన రాజకీయ నాయకులు నెల్సన్ మండేలాని ఆదర్శంగా తీసుకోవాలని కామెంట్ చేశారు. ఆ కామెంట్ చూసి చాలామంది కామెడీతో పొట్టలు పగిలేలా నవ్వుకుంటున్నారు. ఒక పార్టీని పెట్టి, ఆ పార్టీని ఇంత వరకూ ఒక్క అంగుళం కూడా ముందుకు తీసుకెళ్ళని పవన్ కళ్యాణ్... ఆర్నెల్లకోసారి జనంలోకి వచ్చే పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకులకు నీతి సూత్రాలు చెప్పడాన్ని మించిన కామెడీ ఇంకొకటి వుంటుందా. మొన్న చేసిన కామెడీకే జనాలు నవ్వీ నవ్వీ అల్లాడుతుంటే, పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్లో కామెడీ, సస్సెన్స్ మేళవించిన సినిమా చూపించారు.
పవన్ కళ్యాణ్ తన తాజా ట్విట్స్‌లో మరింత కామెడీ చేశారు. తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే, పిల్లలు కొట్టుకుంటూ లేస్తారట. పాలకులు బాధ్యతలేని ప్రవర్తనతో, మాటలతో ప్రభుత్వాలని నడిపితే భావితరాల మధ్య తిరిగి కోలుకోలేనంత అంతర్యుద్ధాలు సంభవిస్తాయట. ఈ డైలాగు ముక్క ఏ రైటర్ రాసిచ్చాడోగానీ సూపర్‌గా వుంది కదూ. పవన్ కళ్యాణ్ ఇక్కడితో ఆగలేదు. ఓటుకు నోటు కేసు, టెలీఫోన్ ట్యాపింగ్ విషయాల మీద తాను మరో రెండు రోజుల్లో స్పందిస్తాడట. రెండు రోజుల తర్వాత ఆయన ఏ రకంగా స్పందిస్తాడో అని జనం టెన్షన్‌తో నలిగిపోవాలనేది ఆయన ఉద్దేశం కాబోలు. ఓటుకు నోటు, టెలీఫోన్ ట్యాపింగ్ అంశాలు ఎప్పటి నుంచో నలుగుతున్నాయి. వాటిమీద పవన్ కళ్యాణ్ స్పందించదలచుకుంటే ఈపాటికే స్పందించాలి. దానికి మరో రెండు రోజులు టైమ్ ఎందుకో. అయినా పవన్ కళ్యాణ్ ఏ రకంగా స్పందించబోతున్నారో కాస్తంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా ఊహించగలరు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలనూ విమర్శిస్తూ, ఈ రెండు ప్రభుత్వాలూ ప్రజలకు అన్యాయం చేస్తున్నాయనే అర్థం వచ్చే విధంగానే ఆయన స్పందిస్తారు. ఎందుకంటే, రెండు ప్రభుత్వాలనూ తిడితేనే కదా మధ్యలో ఆయన హీరో అయ్యేది. రాజకీయంగా పవన్ కళ్యాణ్ చద్ది వ్యూహాలేంటో, ఆయన ఎంత చప్పగా మాట్లాడతాడో అందరికీ తెలిసినవే. అలాంటప్పుడు ఈ సస్సెన్స్ సినిమా చూపించడం ఎందుకట?