ప్రత్యేక తెలంగాణా బదులు ప్రత్యేకమండలి ?
posted on Sep 9, 2012 10:37AM

కేంద్ర పాలితప్రాంతమైన పాండిచేరి పరిధిలోని యానాం మాదిరిగా స్వయంప్రతిపత్తి ఉన్న తెలంగాణా ఆవిర్బవించే అవకాశం ఉందని గతంలో కొందరు భావించారు. అయితే తాజాగా కాంగ్రెస్ తన గౌరవాన్ని కాపాడుకునేందుకు కొత్త ప్రతిపాదన చేయబోతున్నట్లు తెలిసింది. రాష్ట్రపాలిత ఆర్థికప్రతిపత్తి ఉన్న ప్రత్యేకమండలి వైపు కాంగ్రెస్ అథిష్టానం మొగ్గుచూపుతోందని తెలుస్తోంది. దీనిపై సోనియాగాంధీ కసరత్తులు చేస్తున్నారు. అసలు తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం ఇవ్వటానికి అభ్యంతరం లేకపోయినా ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితుల నేపథ్యం వల్ల తాము ఈ నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ ప్రకటించనుంది. రాజకీయాలతో ఈ సమస్యను ముడిపెట్టవద్దని కోరబోతోంది.
.jpg)
భారతీయజనతాపార్టీ వల్లే తాము ఈ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేయనుంది. అయితే బిజెపి మాత్రం తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం కోసం ఆందోళనలు ముమ్మరం చేసింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ వీలైనంత త్వరలో తమ విధానాన్ని ప్రకటించాలని నిశ్చయించుకుంది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఎఐసిసి అథ్యక్షురాలు సోనియాగాంధీ, పార్టీ ప్రతినిధులు సమావేశమై ప్రత్యేకమండలిపై ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలిసింది. టిఆర్‌ఎస్ అథ్యక్షుడు కేసీఆర్ ఇప్పటికే ఢిల్లీలో తిష్టవేసి సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ చర్యలను గమనిస్తున్నారు. అంతేకాకుండా తనకు పరిచయమున్న ప్రతీనేతనూ ప్రశ్నించి తెలంగాణాపై స్పందన తీసుకుంటూ కేసిఆర్ తదుపరి కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఆ పార్టీ తీవ్రస్థాయిలో ఆందోళనకు సిద్ధమవుతోంది.
(1).jpg)
కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా సోనియాను కలిసి ప్రత్యేకతెలంగాణాపై విషయం తేల్చాలని పట్టుబడుతున్నారు. తెలంగాణాలోని కాంగ్రెస్ నేతల సహకారంతో రాష్ట్ర పాలిత ఆర్థిక ప్రతిపత్తి ఉన్న మండలి ఏర్పాటు కానున్నది. దీనిపై ఎటువంటి నిరసనలు వ్యక్తం చేయకుండా చూసే బాధ్యతను ముఖ్యమంత్రితో పాటు మరికొందరు తెలంగాణా నేతలకుకూడా పంచనున్నారు. వీళ్లంతా ఓ పక్క రాష్ట్రంలో శాంతిభద్రతల్ని పర్యవేక్షిస్తుంటే, మరోపక్క కాంగ్రెస్ అధిష్ఠానం చల్లగా ప్రకటన విడుదల చేస్తుంది. తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు లేఖ వచ్చే లోపే తెలంగాణా మండలి ప్రతిపాదన ముగిసిపోవాలని సోనియా కంగారుపడుతున్నారు.