తెలంగాణ మునిసిపోల్స్ కు కేబినెట్ ఆమోదం
posted on Jan 19, 2026 11:11AM

తెలంగాణ మునిసిపోల్స్ నిర్వహణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం (జనవరి 18) జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మేడారంలో జరిగిన కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సచివాలయంలో కాకుండా మేడారంలో కేబినెట్ సమావేశం ఏర్పాటైందన్నారు.
ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్క ఇందుకు చొరవ తీసుకున్నారని, మేడారంలో కేబినెట్ భేటీ విషయంలో అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారని వివరించారు. అందరి ఏకాభిప్రాయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మేడారంలో మంత్రివర్గ సమావేశం జరిగిందన్నారు. ఈ సమావేశంలోనే రాష్ట్రంలో గడువు పూర్తైన 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లలోని 2,996 వార్డులు, డివిజన్లకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు జరపాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్లు ఖరారయ్యయన్నారు.