బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఏకగ్రీవ ఎన్నిక
posted on Jan 19, 2026 4:54PM

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు నడ్డా స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ సోమవారం (జనవరి 19) ముగిసింది. ఈ నామినేషన్ల ప్రక్రియ ముగిసే సరికి ఆ పదవి కోసం నితిన్ నబిన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.
బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నికకు ప్రధాన ఎన్నికల అధికారిగా కె.లక్ష్మణ్ వ్యవహరించారు. ఇక పోతే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఎన్నికను మంగళవారం (జనవరి 20) ఉదయం ప్రధాని మోడీ సమక్షంలో అధికారికంగా ప్రకటిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్ర పార్టీల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జ్‌లు, జాతీయ ఆఫీస్ బేరర్లు, సీనియర్ నాయకులు హాజరవుతారు.