డిసెంబర్ 12న... బర్త్ డే 'పార్టీ' పెడతాడా? 



డిసెంబర్ 12... ఈ తేదీకి మనకైతే పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవచ్చు. కాని, తమిళనాడులో పండగే! కారణం... తలైవా పుట్టిన రోజు కావటమే! కాని, జాగ్రత్తగా గమనిస్తే గత కొన్ని సంవత్సరాలుగా యావత్ దక్షిణ భారతదేశం, ఆ మాటకొస్తే మొత్తం దేశమంతా డిసెంబర్ 12న రజినీ గురించి మాట్లాడుకుంటోంది! శివాజీ, రోబో లాంటి సినిమాల తరువాత సూపర్ స్టార్ ఇమేజ్ దావానలంలా వ్యాపించింది! ఆయన సినిమాతో పాటూ తమ సినిమా రిలీజ్ చేయటానికి బాలీవుడ్ బడా హీరోలు కూడా భయపడుతున్నారు!


ఇతర భాషల వారికి రజినీ కేవలం హీరో. కాని, తమిళులకి, ఆయన అభిమానులకి మాత్రం తలైవా! అంటే, రారాజు. మరి సినిమాల్లో రాజుగా వెలిగిపోతోన్న రజినీకాంత్ నిజంగా చెన్నై సింహాసనాన్ని అధిష్ఠిస్తాడా? ఇప్పటి వరకూ చాలా సార్లు ఈ డిస్కషన్ వచ్చింది. రజినీ పొలిటికల్ ఎంట్రీ అంటూ ఎప్పుడూ హడావిడి జరిగినా చివరికి అంతా చల్లబడిపోతుంది. కాని, ఈ సారి డిసెంబర్ 12న ఆయన 66వ జన్మదినం చేసుకోబోతున్నాడు. అంతే కాదు, తమిళనాడు అమ్మలేని అనాథలా మారిపోయింది. కొద్ది రోజుల ముందే జయలలిత అస్తమించింది. మరి సూపర్ స్టార్ ఈ బర్త్ డేని ఏదైనా స్పెషల్ అనౌన్స్ మెంట్ చేసేందుకు ఎంచుకుంటాడా? ఇప్పుడు చాలా మంది జనంలో ఇదే ఇంట్రస్ట్ స్పస్టంగా కనిపిస్తోంది! అందుకు బలమైన కారణాలు కూడా లేకపోలేదు.... 


రజినీకాంత్ ఎప్పుడూ రాజకీయాలకు దూరమే. ఆయన ఒక్క మాట పార్టీలకు అధికారం సంపాదించి పెట్టగలగే అవకాశం వున్నా కనీసం ప్రచారానికి కూడా వెళ్లలేదు. అందుకే, డీఎంకే, అన్నా డీఎంకే రెండూ ఆయనకు సమన దూరంలో వుంటాయి. కాని, ఇప్పుడు 66ఏళ్ల వయస్సులో రోబో 2.0 సినిమాలో నటిస్తున్న ఆయన ఇంకా ఎన్ని సినిమాలు చేస్తారు, చేయగలరు అనేది పెద్ద చర్చే. ఒకవేళ సినిమా కెరీర్ కి స్వస్తి పలికితే ఆయన నెక్స్ట్ టార్గెట్ ఏంటి? రజినీ చాలా ఈజీగా సీఎం పదవి కోరుకోవచ్చు. ఆయనకున్న సత్తాతో పాటూ ప్రస్తుతం వున్న తమిళ రాజకీయ పరిస్థితి కూడా సూపర్ గా సూటవుతుంది. అందుకే, రాజకీయ విశ్లేషకులు రజినీ రాజకీయ అరంగేట్రానికి ఇదే తగిన సమయం అంటున్నారు. బీజేపీలో చేరటం కాని, స్వంతంగా పార్టీ పెట్టడం కాని, ఏది చేసినా రజినీ వెంట తమిళులంతా నడుస్తారంటున్నారు!


జయ చనిపోవటం, కరుణానిధి హాస్పిటల్లో వుండటం, శశికళ, పన్నీర్ సెల్వం, స్టాలిన్... వీళ్లెవరి మీదా జనాలకు విపరీత అభిమానం లేకపోవటం... ఇలా అనేక అంశాలు రజినీకి రాజకీయాల్లోకి రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. కాని, ఆయన మనసులో ఏముందో మాత్రం ఎవ్వరికీ అంతు చిక్కటం లేదు. ఇక డిసెంబర్ 12న ఆయన సంచలన నిర్ణయం ప్రకటించే అవకాశాలు కూడా తక్కువే. రోబో 2.0 విడుదల వరకూ పొలిటికల్ హడావిడి ఏం చేయకపోవచ్చు! ఆ తరువాత కూడా ఏమీ చేయకుండా హిమాలయ పర్వతాలకి, తన గురువు వద్దకి వెళ్లిపోయినా వెళ్లిపోవచ్చు! ఆఫ్ట్రాల్, ఆయన మాటల్లోనే చెప్పుకుంటే... ఆ అరుణాచలం చెప్పాలి! ఈ అరుణాచలం చేయాలి! 

 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu