ఈ ప్రశ్నలకి జవాబుల్లోనే... అమ్మ అంతం దాగుంది!
posted on Dec 9, 2016 12:43PM

డిసెంబర్ 5తో ఒక శకం ముగిసింది. ఆ శకం పేరు జయలలిత! తమిళులకి అమ్మగా ఎంతో ప్రియమైన ఆమె ఈ నెల 5వ తేదీనే మరణించారా? లేక అంతకు ముందే చనిపోయారా? అసలు ఇంకా దారుణం ఏంటంటే... పురుచ్చి తలైవీ సహజంగానే తుది శ్వాస విడిచారా? లేక ఆమెపై ప్రాణాంతకమైన కుట్ర జరిగిందా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు చాలా చోట్ల చక్కర్లు కొడుతున్నాయి. అయితే, పెద్ద పెద్ద సెలబ్రిటీలు చనిపోయినప్పుడు ఇలాంటి అనుమానాలు, ఊహలు సహజమే. కాని, జయ విషయంలో ఆందోళన కలిగిస్తోన్న సంగతి ఏంటంటే... గౌతమి లాంటి ఒక స్టార్ కూడా ఏకంగా మోదీకి లెటర్ రాయటం. జయలలిత మృతిపై అనేక అనుమానాలున్నాయని, నివృత్తి చేయండని ఆమె కోరిందంటే... పరిస్థితి ఎంతలా విషమంగా వుందో అర్థం చేసుకోవచ్చు!
జయలలిత 75 రోజుల హాస్పిటల్ కాలం ఆమె అభిమానులకి ఎంతో క్షోభ మిగిల్చింది. మామూలు జ్వరం అంటూ ఆపోలోకి వెళ్లిన అమ్మ తిరిగి సజీవంగా బయటకు రాలేదు. నేరుగా సమాధిలోకి వెళ్లిపోయింది. అంతలా ఆమె ఆరోగ్యం హఠాత్తుగా పాడైపోవటానికి కారణం ఏంటి? దీనికి సమాధానమిచ్చేవారే లేరు! అసలు కొందరైతే జయపైన స్లో పాయిజన్ ప్రయోగం జరిగిందని కూడా అంటున్నారు! అందుకే, క్రమంగా క్షీణించి చనిపోయారంటున్నారు....
అపోలో ఆసుపత్రి మొదటి రోజు నుంచి విడుదల చేసిన హెల్త్ బులిటెన్స్ లో జయలలితకు కేవలం జర్వం మాత్రమే అంటూ చెబుతూ వస్తోంది. మరి అంత చిన్న కారణంతో వైద్యం చేయించుకుంటూ వుంటే ఎవ్వర్నీ అనుమతించకపోవటం ఎందుకు? ఈ ప్రశ్నకీ సమాధానం లేదు!
ఒక దశలో ఐసీయూ నుంచి జనరల్ వార్డ్ కు జయను తరలించామని ఆపోలో వైద్యులు చెప్పారు. కాని, జనరల్ వార్డ్ కు వచ్చిన పేషంట్ హఠాత్తుగా సీరియస్ కండీషన్లోకి ఎలా జారిపోతారు? కొన్ని గంటల్లోనే ఎలా మరణిస్తారు? ఇది కూడా ఇప్పుడు తమిళ సామాన్య జనాల్ని పీడిస్తున్న ప్రశ్న. అంతే కాదు, 75రోజులు ఒక సీఎం తమ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ వుంటే... ఒక్క ఫోటో , వీడియో కూడా ఎందుకు విడుదల చేయలేదు? ఎవ్వర్నీ అనుమతించకపోవటమే కాక ఇలా ముఖ్యమంత్రిని అస్సలు బయటకి కనిపించనీయకపోవటం అనేక అనుమానాలు కలిగిస్తోంది!
జయ హాస్పిటల్ లో వున్నప్పుడే ఒక తమిళ ఛానల్ తన ట్విట్టర్ అకౌంట్లో ఆమె మృతి చెందిందంటూ ప్రకటించింది. తరువాత దాన్ని తొలగించింది. కాని, అపోలో యాజమాన్యం దానిపై స్పందించలేదు. జయ బతికే వున్నారని నిరూపించే ఎలాంటి ప్రయత్నమూ వాళ్లు చేయలేదు. ఇక అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వంను ఎంచుకున్నారు. ఒకవేళ జయలలిత మరణం అందరి లాగే వారికి కూడా డిసెంబర్ 5న తెలిసి వుంటే... అంత త్వరగా అందరూ ఏకాభిప్రాయానికి వచ్చేసి పన్నీర్ ను ఎలా ఎంచుకోగలిగారు? అంటే, జయ ఇక లేరనే విషయం ఏఐఏడీఎంకే నేతలకు జనం కన్నా ముందే తెలుసా?
జయ మిస్టిరియస్ డెత్ లో అన్నిటికంటే పెద్ద విషాదం ... ఆమె స్వంత కుటుంబ సభ్యులు ఎవ్వరూ చివరి రోజుల్లో ఆమె పక్కన లేకపోవటం! జయలలిత అన్న కూతురు దీపా జయకుమార్ అపోలో వద్దకొచ్చి లోనికి వెళతానంటే ఆమెను ఎంత మాత్రం అనుమతించలేదు. జయ మేనకోడలు దీపా తాను అనేక రహస్యాలు బయటపెడతానని ప్రకటించింది కూడా. అంటే, దీపా లాంటి జయ స్వంత కుటుంబ సభ్యులు లోనికి వస్తే విభ్రాంతికర విషయాలు బయటకి పొక్కుతాయని శశికళ లాంటి వారు భయపడ్డారా?
జయ స్వర్గస్తురాలైన ఈ దశలోనైనా, ఆమె ట్రీట్ మెంట్ కు సంబంధించిన ఫోటోలు గాని, ఫుటేజ్ గాని బయట పెట్టేందుకు అపోలోకు వున్న అభ్యంతరాలేంటి? తప్పకుండా హాస్పిటల్ ఆధారాలు బయటపెట్టాలని నిబంధన ఏం లేకున్నా... జనంలో వున్న అనుమానాల దృష్ట్యా, ఆ పని చేస్తే బావుంటుందంటున్నారు చాలా మంది. అలాగే, గౌతమి రాసిన లేఖకు స్పందించి మోదీ చర్యలేమైనా తీసుకంటే కూడా నిజాలు బయటకి రావచ్చు! అది జరగాలని మనమూ కోరుకుందాం!