బీజేపీ.. రజినీకాంత్.. ఓ డైలీ సీరియల్!

మీరిస్తానంటే నేనొద్దంటానా"అంటున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఇంతకీ ఎవరు ఇస్తానంటున్నారు? ఏం ఇస్తానంటున్నారు? అనేగా మీ డౌట్. ఇంకెవరు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. రజినీని ఒక రాష్ట్రానికి గవర్నర్ గా నియమించాలని చూస్తోందట. ఈ విషయంపై రజినీ స్పందించలేదు కానీ, ఆయన సోదరుడు సత్యనారాయణ మాత్రం "దేవుడు శాసిస్తాడు, మా అన్నయ్య పాటిస్తాడు" అన్నట్టుగా.. "పదవుల కోసం పాకులాడరు.. పదవి వస్తే మాత్రం తిరస్కరించరు" అంటూ గవర్నర్ పదవి తీసుకోవడం ఇష్టమేనని తన మాటనే రజినీ మాటగా చెప్పేశారు. కానీ ఫైనల్ గా రజినీ ఏ నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమానే.

సినిమాల్లో రజినీకాంత్ దారి రహదారే కానీ.. రాజకీయాల్లో మాత్రం గతుకుల రోడ్డే. సినిమాల్లో జస్ట్ అలా స్టైల్ గా నడిచి ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ఆయన.. రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి మాత్రం ధైర్యం చెయ్యట్లేదు. ఇదిగో రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా.. వచ్చేస్తున్నా అంటూ 2017 నుంచి ఊరించారు రజినీ.  2020 లో అయితే.. రేపు లేకుంటే ఎల్లుండే పార్టీ ప్రకటన అంటూ నెలకోసారి హడావుడి జరిగింది.  అలా ఊరించి ఊరించి చివరికి అనారోగ్య కారణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను అంటూ రాజకీయ ప్రవేశం చేయకుండానే ఆ అంశానికి, అంకానికి శుభం కార్డు వేశారు సూపర్ స్టార్. తాజాగా గవర్నర్ పదవి వార్తలతో దాని సీక్వెల్ కథ మొదలైంది.

రజినీకాంత్ ముందు నుంచి బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారు. బీజేపీకి కూడా సౌత్ లో సూపర్ స్టార్ లాంటి బ్రాండ్ కావాలి. అందుకేనేమో గవర్నర్ పదవి ఆఫర్ చేస్తున్నారు. అయితే ఈ పదవి వల్ల రజినీకి కొత్తగా ఒరిగేదేమి లేదు. ఈ ఐదేళ్ల పదవి కంటే కూడా ఆయనకు జనాల హృదయాల్లో ఎప్పటికీ చెరిగిపోని సూపర్ స్టార్ ఇమేజ్ ఉంది. అయితే రజినీకి గవర్నర్ పదవి ఇచ్చి, తమవాడు అనిపించుకోవడం వల్ల బీజేపీకి బోలెడంత లాభముంది. తమిళనాడులో బీజేపీ ఒక్కసారిగా పుంజుకునే అవకాశముంది. అప్పుడు డీఎంకే ని ఢీ కొట్టే పార్టీ బీజేపీనే అవుతుంది. ఇదంతా జరగాలంటే రజినీపై అధికారికంగా కమలం ముద్ర పడాలి.  ఇటీవలి కాలంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంలతో రజనీ భేటీ కావడం గమనిస్తే,  బీజేపీ పదవి ఇస్తే ఆయన తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ ఆయన మనసు ఎప్పుడైనా మారొచ్చు. రాజకీయాల్లోకి రావాలని చూసి దానిని నాంచి నాంచి చేతులెత్తేశారు. ఇప్పుడు గవర్నర్ గిరీ విషయంలో కూడా.. ఎక్కడ కొన్ని వర్గాలకు దూరం అవుతానోనన్న భయంతో నాంచి నాంచి చివరికి సైడ్ అయిపోయే అవకాశముంది.