ఎనిమిది నెలల్లో అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి

తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీరామారావు ప్రారంభించిన బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి త్వరలో అమరావతిలో కూడా ఏర్పాటు కాబోతోంది. క్యాన్సర్ బాధితుల కోసం నందమూరి తారకరామారావు హైదరాబాద్ లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తదననంతరం ఆ ఆస్పత్రి బాధ్యతలను చేపట్టిన ఆయన కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆ ఆస్పత్రిని అభివృద్ధి చేశారు. ఆస్పత్రిలో ఒక్కో విభాగాన్నీ విస్తరిస్తూ అంతర్జాతీయ ప్రమాణాలతో పేదలకు క్యాన్సర్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.  

అందులో భాగంగానే శనివారం (ఫిబ్రవరి 15) బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో పీడియాట్రిక్‌ వార్డు, పీడియాట్రిక్‌ ఐసీయూను బాలకృష్ణ ప్రారంభించారు. క్యాన్సర్ బాధితులు మనోధైర్యంతో ఉంటే వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుంటారని అన్నారు. ఆర్థిక స్థోమత లేని వారికి క్యాన్సర్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యం అని ప్రకటించిన బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ లో కూడా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఎనిమిది నెలలోనే అమరావతిలో క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తామని చెప్పారు.  అమరావతిలోని తుళ్లూరులో  బసవ తారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్, రీసెర్చ్‌ సెంటర్‌ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 15 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.  తొలి దశలో తుళ్లూరులో 300 పడకలతో  బసవ తారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్ ను తుళ్లూరులో నిర్మించనున్నారు.