అలిపిరి నడకమార్గంలో పెరిగిన చిరుతల సంచారం.. భక్తుల భద్రతకు టీటీడీడ చర్యలు
posted on Feb 15, 2025 1:35PM
.webp)
అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమల దేవుడి దర్శనానికి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని ఆంక్షలు విధించింది. గతంలోలా కాకుండా ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటలలోపు మాత్రమే యథావిథిగా అనుమతిస్తామని టీటీడీ పేర్కొంది. మధ్యాహ్నం రెండు గంటల తరువాత నుంచి గుంపులు గుంపులుగా మాత్రమే భక్తులను అనుమతిస్తారు. అంటే కనీసం వంద మందిని బృందంగా మాత్రమే అలిపిరి నడక మార్గం ద్వారా అనుమతిస్తారు. ఇక చిన్న పిల్లలను అంటే 12 ఏళ్ల లోపు వారిని మధ్యాహ్నం రెండు గంటల తరువాత అలిపిరి నడకమార్గంలో అనుమతించరు.
భక్తుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది. అలిపిరి నడకమార్గంలో చిరుతల సంచా రం పెరగడంతో భక్తుల భద్రతను, క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నా మన్నారు. ఇక రాత్రి తొమ్మిదిన్నర గంటల తరువాత అలిపిరి నడకమార్గాన్ని పూర్తిగా మూసేస్తారు. ఇప్పటికే నడక మార్గంలో విజిలెన్స్ గస్తీని ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే.
ఇటీవల తరచుగా అలిపిరి మార్గంలో చిరుతల సంచారాన్ని గుర్తించడంతో ఈ చర్యలు తీసుకున్నారు. గురవారం (ఫిబ్రవరి 13) అలిపిరి మార్గంలోని ముగ్గుబావి వద్ద చిరుత సంచారాన్ని భక్తులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అలిపిరి నడకమార్గంలో వెళ్లే భక్తలకు ఈ ఆంక్షలు విధించారు.