వైసీపీ సెంటిమెంట్ డ్రామాలు బెడిసికొడుతున్నాయ్!

వైసీపీ ఆవిర్భావమే సెంటెమెంటును అడ్డం పెట్టుకుని జరిగింది. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ముఖ్యమంత్రి పీఠం కోసం జగన్ చేసిన ప్రయత్నాలు కాంగ్రెస్ లో ఫలించకపోవడంతో సొంత పార్టీ పెట్టుకుని తండ్రిని కోల్పోయిన కొడుకును అంటూ జనంలోకి వచ్చారు. నభూతో న భవిష్యత్ అన్న చందంగా తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారిని పరామర్శించేందుకంటే సుదీర్ఘ ఓదార్పు యాత్ర చేశారు. ఆ తరువాత అక్రమాస్తుల కేసులో అరెస్టయ్యారు. తల్లి విజయమ్మ, సోదరి షర్మిలలు  మీ వైఎస్సార్ బిడ్డను అరెస్టు చేశారంటూ రోడ్లపైకి వచ్చి అప్పట్లో సెంటిమెంట్ పండించారు. ఇన్ని చేసినా 2014 ఎన్నికలలో జగన్ పార్టీ అధికారంలోకి రాలేదు.

దీంతో ఆ  తరువాత 2019 ఎన్నికలలో విజయం కోసం జగన్ ఎన్నో సానుభూతి డ్రామాలు ఆడారు. కోడికత్తి దాడి, బాబాయ్ గొడ్డలి పోటు వంటి సంఘటనలతో సానుభూతి వెల్లువెత్తింది. జగన్ పార్టీకి విజయం దక్కింది. అయితే అధికారంలోకి వచ్చిన ఐదేళ్లూ  పాలన అంటే బటన్లు నొక్కడమే అన్నట్లుగా పాలించారు జగన్. అభివృద్ధిని విస్మరించి ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఫ్యాక్షన్ రాజకీయాలకు  అడ్డాగా మార్చేశారు. 2024 ఎన్నికల ముందు కూడా సెంటిమెంట్ పండించడానికి జగన్ చేసిన ప్రయత్నాలను జనం నమ్మలేదు. గులకరాయి దాడి అంటూ కంటి వద్ద పెద్ద బ్యాండేజీ కట్టుకుని ప్రచారం చేసినా జనం నవ్వుకున్నారే తప్ప అయ్యో పాపం అనలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరవాత.. చట్టం, న్యాయం అంటూ మాట్లాడుతుంటే జనం పట్టించుకోవడం లేదు.  

తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టు ద్వారా సానుభూతి పండిద్దామని వైసీపీ చేసిన ప్రయత్నాలు ఇసుమంతైనా ఫలించలేదు. పైపెచ్చు సొంత పార్టీలోనే వంశీ అరెస్టు పట్ల సానుకూలత వ్యక్తం అవుతోంది. ఇన్నాళ్లకు వంశీకి తగిన శాస్తి జరిగింది అన్నట్లుగా కొందరు వైసీపీ నేతలే బాహాటంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.   

గన్నవరంలోని టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి, ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఫిర్యాదుదారుడిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో వంశీ అరెస్టై 14 రోజుల రిమాండ్ లో ఉన్నారు. విజయవాడ జిల్లా జైలులో ఊచలు లెక్కెడుతున్నారు. ఈ తరుణంలో వైసీపీయులు అరెస్టు అన్యాయం, అక్రమం, చట్టానికి తూట్లు అంటూ చేస్తున్న వ్యాఖ్యలను చూసి జనం నవ్వి  పోతున్నారు. అధికారంలో ఉండగా గుర్తుకురాని ఈ పదాలు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయా అని ఎగతాళి చేస్తున్నారు. అదలా ఉంచితే...

వంశీ సతీమణి పంకజశ్రీ తన భర్త అరెస్టును ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు.  అంతకు ముందు హైదరాబాద్ లో వంశీని అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తుండగా, ఆమె తన సొంత వాహనంలో పోలీసుల కాన్వాయ్ ను అనుసరించారు. అయితే  పోలీసులు మార్గ మధ్యంలో ఆమెను నిలువరించి అదుపులోనికి తీసుకున్నారు. ఆ తరువాత వదిలేశారు. అనంతరం ఆమె  కృష్ణలంక పోలీసు స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడారు. అదే పోలీసు స్టేషన్ లో పోలీసులు వంశీని విచారిస్తున్న సమయంలో ఆమె పోలీసు స్టేషన్ బయట మీడియాతో మాట్లాడారు. తన భర్తను అన్యాయంగా అరెస్టు చేశారనీ, అరెస్టుకు కారణం కూడా చెప్పలేదనీ కన్నీళ్ల పర్యంతమయ్యారు. సెంటిమెంట్ ను పండించేందుకు శతధా ప్రయత్నించారు. 

అధికారం కోల్పోయిన తరువాత గత ఎనిమిది నెలలుగా వైసీపీ సెంటిమెంటును పండించేందుకు ఈ వ్యూహాన్నే అనుసరిస్తోంది. సోషల్ మీడియాలో బూతు, రోత పోస్టులతో రెచ్చిపోయిన వర్రా రవీంద్రారెడ్డి, ఇంటూరి రవికిరణ్ లను పోలీసులు అరెస్టు చేసిన సందర్భంలో కూడా వారి భార్యలు మీడియా ముందుకు వచ్చి అక్రమ అరెస్టులంటూ ఆరోపణలు గుప్పించారు. అయితే ఆ రెండు సందర్భాలలోనూ, ఇప్పుడు వంశీ అరెస్టు సందర్భంగానూ కూడా వైసీపీ సెంటిమెంట్ రాజకీయాలు ఎలాంటి ప్రభావం చూపలేదు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu