బాలినేనితో విడదల రజనీ భేటీ.. ఇక జనసేన తీర్థమేనా?
posted on Feb 15, 2025 11:59AM

2024 ఎన్నికలలో ఘోర పరాజయంతో వైసీపీ పనైపోయిందన్నది స్పష్టమైపోయింది. నభూతో న భవిష్యత్ అన్న రీతీలో ఐదేళ్ల అధికారంలో ఉన్న పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించి జనం మీ సేవలింక చాలు అని విస్పష్టంగా జగన్ కు తేల్చి చెప్పారు. అధికారంలో ఉన్నంత కాలం జగన్ అండ చూసుకుని ఇష్టారీతిగా చెలరేగిన వాళ్లందరూ ఇప్పుడు మౌనాన్ని ఆశ్రయించి, తమ తప్పులకు, దౌర్జన్యాలకు ఫలితం అనుభవించాల్సిన రోజు ఎప్పుడొస్తుందో అన్న భయంతో బతుకీడుస్తున్నారు.
ఇప్పటికే పలువురు జగన్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని భావించి, వైసీపీకి గుడ్ బై చెప్పేసి.. కూటమి పార్టీలలో చేరిపోయారు. అలా అవకాశం లేని విజయసాయిరెడ్డి ఏకంగా రాజకీ యాలకే గుడ్ బై చెప్పేశారు. అదే దారిలో మరింత మంది ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పరిశీలకుల వరకూ కూడా అవసరం లేదు... స్వయంగా జగన్ పార్టీ నుంచి మరి కొందరు వెళ్లిపోయేలా ఉన్నారు అని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడంపై మాట్లాడిన జగన్ ఆ సందర్భంగానే విజయసాయిలా క్యారెక్టర్ లేని మరో ఇద్దరు ముగ్గురు పార్టీని వీడిపోతారని చెప్పేశారు. వైసీపీ పరిస్థితి అలా తయారైంది. ఏ నాయకుడు పార్టీని వీడతారో తెలియని పరిస్థితి ఉంది. జగన్ వినా మరెవరికీ పార్టీ మళ్లీ పుంజుకుంటుందన్న నమ్మకం వీసమెత్తైనా లేని పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.
ఈ తరుణంలో చిలకలూరి పేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడదల రజనీ ఇటీవల మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో భేటీ అయ్యారన్న వార్తలు గుప్పుమన్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు సమీప బంధువు అన్న సంగతి తెలిసిందే. అటువంటి బాలినేని పార్టీ పరాజయం తరువాత వైసీపీని వీడి జనసేన గూటికి చేరారు. అటువంటి బాలినేనితో విడదల రజినీ ఇటీవల బేటీ అయ్యారు. ఆ విషయం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. దీంతో విడదల రజనీ జనసేన బాట పట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
చిలకలూరి పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2019 విజయం సాధించిన విడదల రజినీకి జగన్ తన క్యాబినెట్ లో అవకాశం ఇచ్చారు. దీంతో తొలిసారి ఎమ్మెల్యే అయ్యి కూడా కేబినెట్ బెర్త్ దక్కించుకున్న విడదల రజినీ మంత్రి హోదాలో దోచుకో.. దాచుకో అన్నట్లుగా వ్యవహరించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. సరే 2024 ఎన్నికలు వచ్చే సరికి విడదల రజినీని చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్ట్ కు మార్చేశారు జగన్. చిలకలూరి పేట నియోజకవర్గంలో ఆమె పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందనీ, జనం ఆమెను ఓడించాలన్న నిర్ణయానికి వచ్చేశారనీ, అందుకే ఆమెను గుంటూరు వెస్ట్ కు మార్చారనీ అప్పట్లో వైసీపీ వర్గాలే బాహాటంగా చెప్పాయి. సరే 2024 ఎన్నికలలో గుంటూరు వెస్ట్ నుంచి ఆమె పరాజయం పాలయ్యారు. జగన్ పార్టీ కూడా అధికారం కోల్పోయింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
అప్పటి నుంచీ విడదల రజనీ దౌర్జన్యాలు, ఆక్రమణలు, అక్రమ వసూళ్లపై ఫిర్యాదుల వెల్లువ మొదలైంది. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం భయంతో నోరుమెదపని బాధితులు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కరొక్కరుగా బయటకు వచ్చి ఫిర్యాదులు చేశారు. దీంతో ఆమెపై వరుసగా కేసులు నమోదౌతున్నాయి. తాజాగా రజినీపై అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఆమె వైసీపీని వీడి సేఫ్ జోన్ లోకి వెళ్లాలన్న ప్రయత్నాలు మొదలు పెట్టారు. తాజాగా ఆమె మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో భేటీ కావడంతో ఆమె వైసీపీకి గుడ్ బై చెప్పేయడం ఖాయమైనట్లునని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.