ప్రియాంకను చూసి నేర్చుకోండి !

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా  కు పరిచయమ అవసరం లేదు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సోదరి. అంతే కాదు, గతంలో రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన వయనాడ్ ( కేరళ) నియోజక వర్గం ప్రస్తుత ఎంపీ ప్రియాంక. 2024 ఎన్నికల్లో రాహుల గాంధీ  వయనాడ్ తో పాటుగా ఉత్తర ప్రదేశ్ లోని అమేథీ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. రెండు చోట్లా గెలిచారు.  ఆ తర్వాత  రాహుల్ గాంధీ అమేథీని ఉంచుకుని  వయనాడ్ ను వదిలేశారు. సొంత నియోజక వర్గం అమేథీ ఎంపీగా కొనసాగుతున్నారు. అలా రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్  లోక్ సభ స్థానానికి   జరిగిన ఉపఎన్నికల్లో ప్రియాంక వాద్రా కాంగ్రస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. గెలిచారు. ఇప్పడు, ఆమె వయనాడ్  ఎంపీ.

అయితే ఇదంతా అందరికీ తెలిసిన విషయమే అయినా  ఇప్పడు  ఆమె గురించి మాట్లాడుకోడానికి ఓ మంచి కారణమే వుంది. ఆమె ఓ మంచి బ్రేకింగ్ న్యూస్ చెప్పారు. ఆమె  తమ నియోజక వర్గం ప్రజల మాతృ భాష మలయాళం నేర్చుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు. ఉప ఎన్నికల ప్రచార సమయంలో  కేరళ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు  కేంద్ర మాజీ మంత్రి ఏకే అంటోనీ ఇచ్చిన సలహా మేరకు తాను  ప్రత్యేకంగా ఒక టీచర్ ను పెట్టుకుని మరీ మళయాళం నేర్చుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాదు  ఇప్పటికే తనకు మలయాళం కొంచెం కొంచెం అర్థమవుతోందని, కుంచెం కుచెం   మాట్లాడగల్గుతున్నానని  చెప్పారు. సంతోషం. అభినందనీయం.  
ఐదేళ్ళు అదే వయనాడ్  నియోజక వర్గానికి ప్రాతినిత్యం వహించిన రాహుల్ గాంధీకి మలయాళం ఎంత వచ్చునో, ఎంత రాదో మనకు తెలియదు కానీ, ఉప ఎన్నికల్లో గెలిచి ఇంకా ఐదు నెలలు అయినా కాక ముందే ప్రియాంక  మలయాళం నేర్చుకోవడం  అభినందనీయం. అన్నిటినీ మించి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజల సమస్యలు తెలుసుకునేదుకు  వారి మాతృ భాష నేర్చుకోవాలని  ఆంటోనీ ఇచ్చిన సలహాను అక్కడే మరిచి పోకుండా   ఆచరణలో పెట్టడం చాలా చాలా అభినందనీయం.   

సహజంగా  ప్రజాప్రతినిధులకు తాము ప్రాతినిధ్యం వహించే’ నియోజక వర్గం ప్రజల భాష వచ్చే ఉంటుంది. కానీ  ఇదిగో ఇలా వలస వెళ్లి వేరే రాష్టాల నుంచి పోటీ చేయవలసి వచ్చి నప్పుడే భాషా సమస్య వస్తుంది. ముఖ్యంగా ఉత్తరాది నాయకులు దక్షణాది రాష్ట్రాల్లో పోటీ చేసినప్పుడు  భాషా సమస్యను ఎదుర్కుంటారు. 

గతంలో  1999లో కర్ణాటకలోని బళ్ళారి లోక్ సభ నియోజక వర్గం ఉప ఎన్నికలో  కాంగ్రెస్ అభ్యర్ధిగా, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బీజేపీ అభ్యర్ధిగా  సుష్మా స్వరాజ్ పోటీ చేశారు. ఇద్దరికీ  కన్నడం రాదు. సోనియా గాంధీ ఏ భాషలో మాట్లాడారో ఏమో కానీ,   సుష్మాస్వరాజ్  మాత్రం పట్టుపట్టి కన్నడం నేర్చుకున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో కన్నడంలో ప్రసంగించారు. అయినా  ఆ ఎన్నికల్లో సోనియా గాంధీ గెలిచారు. సుష్మా స్వరాజ్ ఓడి పోయారు. ఓడిపోతే  ఓడి పోయారు కానీ, ఆమె చాలా తక్కువ సమయంలో అంటూ  30 రోజులకంటే తక్కువ రోజుల్లో  కన్నడ  భాష నేర్చుకున్నారు. 
సరే  ప్రజాప్రతినిధులు అందరూ సుష్మా స్వరాజ్ లా పక్షం రోజుల్లోనే పరాయి భాష నేర్చుకోలేక పోవచ్చును. పీవీ నరసింహ రావులాగా  14 భాషల్లో మాట్లాడలేక పోవచ్చును కానీ, తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంత ప్రజల భాష మాట్లాడ లేక పోవడం మాత్రం, ఆక్షేపణీయం. ఒక రకంగా అది వారికే అవమానం. 

 కానీ తెలుగురాష్ట్రంలోనూ ప్రజల భాష తెలుగు రాని ప్రజాప్రతినిధులు ఉన్నారు. తెలంగాణ శాసన సభ విషయాన్నే తీసుకుంటే, ఎంఐఎం  పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ 20 ఏళ్లకు పైగానే  తెలుగు సభ లో ఎమ్మెల్యేగా ఉన్నారు. హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలోని చాంద్రాయగుట్ట నియోజక వర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మాత్రమే కాదు,ఆయన తండ్రి సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ, సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ  కూడా ఎమ్మెల్యేలుగా,  ఎంపీలుగా ఉన్నారు. అయినా ఆయనకు గానీ, అయన కుటుంబ సభ్యులకు గానీ తెలుగు రాదు.ఇంగ్లీష్ లో  అయితే అనర్గళంగా మాట్లాడతారు. అవసరం అనుకుంటే  తమ ఓటర్ల  కోసం ఉర్దూలోకి షిఫ్ట్ అవుతారు. కానీ తెలుగులో మాత్రం ఒక్క ముక్క మాట్లాడలేరు. మాట్లాడ లేక పోవడం  మాత్రమే కాదు. కనీసం అర్థం చేసుకోలేరు. తెలుగు రాష్ట్రంలో పుట్టి  తెలుగు రాష్ట్రంలో పెరిగి,  20 ఏళ్లకు పైగా తెలుగు శాసనసభలో సభ్యునిగా ఉండి మెజారిటీ సభ్యులు, మంత్రుల తెలుగు ఉపన్యాసాలు  వింటూ కూడా ఆయనకు తెలుగు తలకెక్కలేదు.  
అయితే  ఆయన మంత్రి సీతక్కకు ఉర్దూ, ఇంగ్లీష్ రాదని ఆక్షేపించారు. మంత్రికి ఇంగ్లీష్, ఉర్దూ రాదు, నాకు తెలుగు రాదు, పరస్పరం ఒకరిని  ఒకరం అర్థంచేసుకోలేక పోతున్నాం.  అంటూ తనకు తెలుగు రానందుకు  క్షమాపణలు చెప్పారు. కానీ  అదే సమయంలో ఆయన మంత్రి సీతక్కను అవమాన పరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు వివాద మయ్యాయి. 

అయినా ఇప్పటికైనా  ప్రియాంకను ఆదర్శంగా తీసుకుని అయినా ఒవైసీ సోదరులు తెలుగు నేర్చుకుంటారేమో చూద్దాం. నిజానికి  ఒవైసీ సోదరులు మాత్రమే కాదు  ప్రజల భాష రాని ప్రజా ప్రనిధులు ఇంకా ఉండే ఉంటారు. ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి నవీన్  పట్నాయక్ కు ఒరియా భాష రాదని అంటారు. అది ఎంత వరకు నిజమో కానీ  ప్రజాప్రతినిధులకు ప్రజల భాష రావడం అవసరం. అది ఒవైసీలు కావచ్చును, మరొకరు కావచ్చును.