విశాఖ ఐకానిక్ క్యాపిటల్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు
posted on Mar 31, 2025 10:12PM

విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించి నానా హడావుడి చేసిన జగన్ సర్కారు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది. మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో తన నివాసం కోసం రుషికొండను తొలిచి ప్రజాధనంతో ఒక భారీ ప్యాలెస్ మాత్రం జగన్ కట్టించారు. దాన్ని ఏం చేసుకోవాలో తెలియని స్థితిలో కూటమి సర్కారు ఉంది. మరో వైపు విశాఖను దేశంలోనే ఐదవ ఎకనామిక్ క్యాపిటల్‌గా మార్చే విధంగా చర్యలు తీసుకుంటూ కూటమి సర్కారు , విశాఖను ఒక బ్రాండ్‌గా మార్చే పనిలో పడింది.
విశాఖను దేశంలోనే ఐదవ ఎకనామిక్ క్యాపిటల్‌గా మార్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామనీ, విశాఖను ఒక బ్రాండ్‌గా మార్చుతామని చెప్పుకొచ్చారు. ఎన్నికల ఫలితాల్లో తనకు రాష్ట్రంలో అత్యధిక మెజార్టీలలో స్థానాల్లో మూడవ స్థానం వచ్చినందుకు కొంచెం బాధనిపించిందనీ, కానీ మొదటి రెండు అత్యధిక మెజారిటీ స్థానాలు విశాఖకు వచ్చాయన్నారు. దీన్ని బట్టి విశాఖ ప్రజలు తమపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారని అర్థమైందన్నారు. విశాఖను అభివృద్ధి చేసి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు.
వరుణ్ గ్రూప్ నిర్మాణం చేపడుతున్న వరుణ్ బే సాండ్స్ హోటల్ కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాదు... భారతదేశంలోనే ఒక ఐకానిక్ ప్లేస్‌గా మిగులుతుందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా, పర్యాటకంగా, ఐటీ పరంగా అభివృద్ధి చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. గడిచిన ఐదేళ్లలో ప్రజలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారన్నారు. చంద్రబాబును విశాఖపట్నం ఎయిర్‌పోర్టులోకి నగరంలోకి రాకుండా అడ్డగించారన్నారు. విజయనగరం తీర్థాలు గుడికి వెళుతుంటే బుల్డోజర్లు, జేసీబీలు పెట్టి రాకుండా చేయాలని చేశారని మండిపడ్డారు. లులు గ్రూప్ కూడా త్వరలో విశాఖకు వస్తుందన్నారు. గడిచిన 10 నెలల్లోనే విశాఖకు టీసీఎస్, మెటల్ ప్లాంట్, హైడ్రోజన్ ప్లాంట్ వంటి సంస్ధలను తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా తీసుకున్నామని చెప్పారు.
మన ముఖ్యమంత్రి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు.. స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్ చేయమంటున్నారని లోకేష్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలోనే ట్రిలియన్ డాలర్ ఎకానమీని తీసుకొస్తామని గర్వంగా చెప్తుతున్నామని తెలిపారు. జగన్ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పాలని... 9 నెంబర్లలో లార్జెస్ట్ ఎకనామికల్ సిటీగా ఉన్న విశాఖను పదోవ స్థానానికి దించారని విమర్శలు గుప్పించారు. ఎంపీ భరత్, విశాఖ శాసనసభ్యులపై దృష్టి సారించి విశాఖను 5వ లార్జెస్ట్ ఎకనామికల్ సిటీగా నిలబెడతారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఐటీ డెస్టినేషన్‌గా మారుతుందన్నారు. వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షల ఐటీ ఉద్యోగాలు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని... ఇప్పటికే రోడ్ మ్యాప్ కూడా పూర్తయిందని వెల్లడించారు. విశాఖ అన్ని విధాల అభివృద్ధి చెందడానికి అనువైన ప్రాంతమన్నారు. హోటల్స్, కాన్సెర్ట్స్, క్రికెట్ మ్యాచ్ లు జరిగే వైబ్రెంట్ సిటీ విశాఖపట్నం అని తెలిపారు.
అమరావతి భవనాల నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. ఇప్పుడు వరుణ్ గ్రూప్ చేపడుతున్న హోటల్ రెండేళ్లలోనే పూర్తి చేస్తారని నమ్మకం ఉందన్నారు. 2027 మార్చి 31 లోపు వరుణ్ గ్రూప్ చేపడుతున్న వరుణ్ బే సాండ్స్ హోటల్‌ను పూర్తి చేయాలన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సంవత్సరంలోపు ప్రారంభం చేస్తామన్నారు. విజయవాడ ఎయిర్‌పోర్టు కన్నా ముందే... భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభిస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.