మాజీ మంత్రి కాకాణికి పోలీసుల సీరియస్ వార్నింగ్

పరారీలో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. పొడలకూరు మండలంలో జరిగిన అక్రమ మైనింగ్ కేసులో సోమవారం విచారణకు కాకాణి డుమ్మా కొట్టారు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చిన పోలీసులు.. మంగళవారం విచారణకు రావాలని ఆదేశించారు. నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని కాకాణి ఇంటికి వెళ్లారు పోలీసులు. అయితే మాజీ మంత్రి అందుబాటులో లేకపోవడంతో ఆయన బంధువులకు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని.. లేకపోతే చట్టపరంగా చర్యలు ఉంటాయని పోలీసు అధికారులు హెచ్చరించారు.

 కాగా.. కాకాణి కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. అక్రమ మైనింగ్ కేసును పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. రెండు రోజుల క్రితం కాకాణిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. తనను ఏమీ చేయాలేరు.. అక్రమ కేసులు బనాయించినా జైలుకు వెళ్లేందుకు సిద్ధమన్న కాకాణి.. ఆ తరువాత కనిపించకుండా పోయారు. ఈ కేసులో కాకాణితో పాటు ఐదుగురు నిందితులు కూడా పరారీలో ఉన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు డీఎస్పీ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చేందుకు కాకాణి ఇంటికి వెళ్లారు పోలీసులు. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆయన ఇంటి గేట్లకు నోటీసులు అతికించారు.

ఆ తరువాత కొద్దిసేపటికే తాను ఎక్కడికీ పారిపోలేదంటూ కాకాణి ఓ పోస్టు పెట్టారు. హైదరాబాద్‌లోని తన నివాసంలోనే ఉన్నానని.. కుటుంబ సభ్యులతో కలిసి ఉగాది పండుగను చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేశారు. వెంటనే పోలీసులు హైదరాబాద్‌కు వెళ్లాగా.. సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అక్కడ కూడా కాకాణి లేరని పోలీసులు గుర్తించారు. దీంతో ఆయన సమీప బంధువుకు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో రేపు ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో కాకాణి హాజరుకావాల్సి ఉంది. అయితే పోలీసుల విచారణకు కాకాణి హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.