గుజరాత్ గర్జన.. టార్గెట్ నమో.. షా!
posted on Apr 1, 2025 9:32AM
.webp)
కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీకి బలమైన సవాల్ విరారు. గుజరాత్ లో బీజేపీని ఓడిస్తామని శపథం చేశారు. ఎక్కడో కాదు.. లోక్ సభ వేదికగా బీజేపీని ఉద్దేశించి రాసి పెట్టుకోండి ఈ సారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించి తీరుతాం అని సవాల్ విసిరారు. చక్కటి హిందీలో ఒకటికి రెండుసార్లు ఆప్ లిఖ్కే లేలో.. లిఖ్కే లేలో ఔర్ ఆప్ కో హమ్, గుజరాత్ మే హరాయింగే ఇస్ బార్ అని సవాల్ విసిరారు.
అయితే ఆయన ఆ సవాలు విసిరిన కొద్ది రోజులకే అదే గుజరాత్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు పాత చరిత్రనే తిరగ రాసింది. రాష్ట్రం మొత్తంలో 1912 వార్డులకుకు ఎన్నికలు జరిగితే బీజేపీ 1402 వార్డులు గెలుచుకుంది. కాంగ్రెస్ 260 వార్డులతో సరిపెట్టుకుంది. తాలుకా పంచాయత్ ల విషయానికి వస్తే.. 55 తాలుకా పంచాయత్ లు బీజేపీ సొంతం చేసుకుంటే, కాంగ్రెస్ కు దక్కింది 17 మాత్రమే. అలాగే 68 నగర పాలికలకు ఎన్నికలు జరిగితే 63 బీజేపీ గెలుచుకుంటే, కాంగ్రెస్ ఖాతాలో చేరింది ఒకే ఒక్కటి. ఈ ఫలితాలను బట్టి చూస్తే గుజారాత్ రాజకీయ ముఖచిత్రంలో రాహుల్ మార్క్ మార్పునకు స్కోప్ కనిపించడం లేదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. తర్వాత ఎప్పుడో జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను స్థానిక సంస్థల ఫలితాలు ఆధారంగా లెక్కలేస్తున్నారు. అయినా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సంవత్సరం పైగానే సమయం వుంది. సో ఈ సంవత్సరం పై చిలుకు కాలంలో ఏమైనా జరగ వచ్చు. గుర్రం ఎగరా వచ్చు.. కాంగ్రెస్ పార్టీ గెలవా వచ్చు అనే ఆశా జీవులు రాహుల్ గాంధీకీ జై కొడుతున్నారు.
అయితే కేవలం స్థానిక సంస్థల ఫలితాల ఆధారంగానే రేపటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లెక్క కడుతున్నారా అంటే లేదు. కాంగ్రెస్ పార్టీ 1995 నుంచి ఇంతవరకు వరసగా ఏడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పోయింది. అలాగే వరసగా 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటు దక్కించుకోలేక పోయింది. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న మొత్తం 26 లోక్ సభ స్థానాలకు గానూ, కాంగ్రెస్ ఒకే ఒక్క సీటులో గెలిచింది. మిగిలిన పాతిక సీట్లూ బీజేపీ సొంతం చేసుకుంది.
నిజానికి కాంగ్రెస్ పార్టీ వరసగా ఓడిపోతున్న రాష్ట్రాలు ఇంకా ఉన్నాయి, కానీ, అలాంటి వరస ఓటమి రాష్ట్రాల జాబితాలో గుజరాత్ ముందు వరసలో ఉంటుంది. గుజరాత్ లో ఇంచుమించుగా మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి అధికారం అందని దక్షాగానే మిగిలి పోయింది. 1995లో మొదలైన వరస ఓటముల పరంపర ఈ రోజుకూ కొనసాగుతూనే వుంది. అంతకు ముందు పదేళ్ళ కాలంలోనూ గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ ప్రయాణం పడుతూ లేస్తూనే సాగింది. ఇక ఆ తర్వాత 2001లో నరేంద్ర మోదీ ఎంట్రీతో గుజరాత్ రాజకీయ ముఖచిత్రమే మారిపోయంది. మోదీ ఎంట్రీ తర్వాత జరిగిన ఆరు అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ వరస విజయాలను సొంతం చేసుకుంది. ఓటమి కాంగ్రెస్ ‘చేయి’ వదలలేదు.
అయితే రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి. కొత్తేమీ కాదు. చూస్తున్నదే. సో వరసగా ఏడు సార్లు ఓడిన హస్తం పార్టీ ఎనిమిదో సారీ ఖాయంగా ఓడిపోతుందని గానీ ఏడు సార్లు గెలిచిన బీజేపీ ఎనిమిదో సారి కూడా గెలిచి తీరుతుందని గానీ అనుకోలేము. అలా అనుకుంటే అది అయితే రాజకీయ అజ్ఞానం, కాదంటే అహంకారం అవుతుంది. అందుకే రాహుల్ గాంధీ లోక్ సభ వేదికగా బీజేపీకి విసిరిన సవాల్ ను అంత తేలిగ్గా తీసుకోరాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అదలా ఉంటే రాహుల్ గాంధీ వ్యూహం, అంతిమ లక్ష్యం ఏమిటో కానీ ఆయన వైఖరి చూస్తుంటే దేశం మొత్తం ఒకెత్తు, గుజరాత్ ఒక్కటీ ఒకెత్తు అన్నట్లుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బహుశా కొడితే బీజేపీ (మోదీ – షా జోడీ సొంత గడ్డ) కుంభ స్థలాన్నే కొట్టాలనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ గుజరాత్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో ఇంటా,బయట, పార్లమెంట్ లోపల వెలుపల. తరచూ గుజరాత్ ప్రస్తావన తెస్తున్నారు.
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే రాహుల్ గత జూన్ లోనే గుజరాత్ లో ల్యాండ్ అయ్యా రు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి చాలా గంభీర ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా, ఆయన లోక్ సభ ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీని ఓడించాం, రేపటి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీని ఓడిస్తాం అని విశ్వాస ప్రకటన లాంటిది చేశారు. అలాగే ఇటీవల మరోమారు గుజరాత్ వెళ్లిన రాహుల్ గాంధీ అక్కడి నుంచే కాంగ్రెస్ లో కమల దళం కోవర్టులున్నారు అనే సంచలన ప్రకటన చేశారు. అలాంటి ఇంటి దొంగలను ఏరి పారేస్తామని హెచ్చరించారు. అందుకే రాజకీయ విశ్లేషకులు సర్వ శక్తులు ఒడ్డైనా గుజరాత్ లో మోదీ – షాల జోడిని ఓడించి తీరాలనే కసి రాహుల్ గాంధీలో కనిపిస్తోందని అంటున్నారు.
అందుకే ఏప్రిల్ 8,9 తేదీల్లో అహ్మదాబాద్’లో ఏఐసీసీ’ సమావేశాలు, నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. 64 సంవత్సరాల తర్వాత తొలి సారిగా గుజరాత్’ ఏఐసీసీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడంలోనే కాంగ్రెస్ పార్టీ టార్గెట్ అర్థమవుతోందని అంటున్నారు. మోదీ- షా జోడీని సొంత గడ్డపై ఓడించాలానే లక్ష్యంతోనే ఎఐసీసీ సమావేశంతో పాటుగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) విస్తృత స్థాయి సమావేశం కూడా అహ్మదాబాద్ లో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందనీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ గుజరాత్ నుంచే కాంగ్రెస్ పార్టీ పునర్జీవన ప్రస్థానం ప్రారంభించాలని నిర్ణయించారని అంటున్నారు. అందుకే ఏప్రిల్ 8,9 తేదీలలో కాంగ్రెస్ సంసారం మొత్తం అహ్మదాబాద్ లో ఉండేలా ఏఐసీసీతో పాటు, సిడబ్ల్యుసి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు చెపుతున్నారు. ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ బల ప్రదర్శనకు, ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్దమవుతోందని అంటున్నారు. అందుకే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీలో మరో శక్తి పీఠంగా ఎదిగి వస్తున్న ప్రియాంకా వాద్రాతో పాటుగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు,ఉప ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ సభ్యులు,ఇతర సీనియర్ నాయకులు, ఎఐసీసీ ప్రతినిధులు, ఒకరనేమిటి కాంగ్రెస్ యోధాను యోధులంతా గుజరాత్ గర్జనకు సిద్ధమవుతున్నారు. అయితే మిషన్ 27 ప్రధాన ఎజెండా గా జరుగుతున్న ఈ సమావేశాలలో.. నమో షా ..ను టార్గెట్ చేస్తారా? చేస్తే, ఏమవుతుంది? ఇంతా చేసిన తర్వాత మళ్ళీ చరిత్ర పునరావృతం అయితే ... ?