జగన్ కు మరో బిగ్ షాక్? తోట త్రిమూర్తులు జంప్?
posted on Mar 29, 2025 9:41AM

అధికారం కోల్పోయిన తరువాత వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీ కీలక నేతలు ఒకరి తరువాత ఒకరుగా పార్టీకి రాజీనామా చేసి కూటమి పార్టీలలో సర్దుకుంటున్నారు. ఇక వైసీపీ అధికారంలో ఉండగా ఇష్టారీతిగా చెలరేగి దాడులు, దౌర్జన్యాలు చేసిన నేతలూ, ప్రత్యర్థి పార్టీల నేతలపై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయిన నాయకులపై చట్ట ప్రకారం చర్యలకు కూటమి సర్కార్ ఉపక్రమించింది. దీంతో ఇప్పటికే పలువురు అరెస్టయ్యారు. ఇంకొందరు బెయిలుపై ఉన్నారు. మరి కొందరు బెయిలు కోసం కోర్టులను ఆశ్రయించారు. ఈ పరిస్థితుల్లో వైసీపీకీ, జగన్ కు మరో బిగ్ షాక్ తగలనుందా? అంటే వైసీపీ శ్రేణులే అవునని అంటున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కీలక నాయకుడు తోట త్రిమూర్తులు వైసీపీని వీడనున్నారని అంటున్నారు. ఆయన జనసేన తీర్ధం పుచ్చోవడం ఖాయమని అంటున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది వైసీపీ నాయకులు పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురం ఎమ్మెల్సీ తోట త్రిమూ ర్తులు కూడా అదే దారిలో నడవనున్నారు. ఇప్పటికే ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. తమ ఎమ్మెల్సీ సభ్యత్వాలకు కూడా రాజీనామా చేశారు. తోట త్రిమూర్తులు కూడా రాజీనామా చేయడం జరిగితే వైసీపీని వీడిన ఎమ్మెల్సీల సంఖ్య ఆరుకు చేరుతుంది. ఇప్పటికే ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తోట త్రిమూర్తులు పార్టీని వీడనున్నారన్న ప్రచారం వైసీపీలోనే జోరుగా సాగుతోంది.
తోట త్రిమూర్తులు1994లో స్వతంత్ర అభ్యర్థిగా రామచంద్రపురం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. 1995లో తెలుగుదేశంలో చేరి 1999లో అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో ఎన్నికలలో ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. వెళ్లారు. 2019లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆయన జనసేన గూటికి చేరే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో పవన్ కల్యాణ్ తో భేటీ అయిన తోట త్రిమూర్తులు ఆయనతో ఫొటో కూడా దిగారు. అప్పటి నుంచీ తోట త్రిమూర్తులు జగన్ కు షాక్ ఇచ్చి జనసేన గూటికి చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.