కోర్టులో పోసాని కొత్త డ్రామా?

గుండె నొప్పి డ్రామా ఫెయిలవ్వడంతో పోసాని ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టారా? అంటే సీఐడీ కోర్టులో బుధవారం (మార్చి 12) పోసాని చేసిన ఆత్మహత్యే శరణ్యం వ్యాఖ్యలను బట్టి ఔననే సమాధానమే వస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. పీటీ వారంట్ పై పోసానిని కర్నూలు జైలు నుంచి అదుపులోనికి తీసుకుని గుంటూరు సీఐడీ కోర్టులో హాజరు పరిచిన సందర్భంగా పోసాని న్యాయమూర్తి ఎదుట భోరు మన్నారు. బెయిలు ఇవ్వకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ దాదాపు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసినంత పని చేశారు.

తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని, రెండు స్టంట్ లు వేశారనీ చెప్పుకున్నారు. తాను అడ్డూ అదుపూ లేకుండా చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి ప్రస్తావించకుండా, తనపై వ్యక్తిగత కక్షతోనే ఫిర్యాదులు చేస్తున్నారంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఒకటి రెండు రోజులలో బెయిలు రాకుంటే ఆత్మహత్యే చేసుకుంటానని బెదరింపులకు దిగారు. అయితే న్యాయమూర్తి పోసానిని రిమాండ్ కు పంపారు. దీంతో పోసానికి  గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. వాస్తవానికి పోసానికి ఇతర కేసులలో బెయిలు లభించింది. అంతే కాదు ఆయనపై ఉన్న ఇతర కేసులలో నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆయన కర్నూలు జైలు నుంచి బుధవారం (మార్చి 12) విడుదల అవుతారని అంతా భావించారు.

అయితే అనూహ్యంగా సీఐడీ రంగంలోకి దిగింది. పీటీ వారెంట్ పై ఆయనను అదుపులోకి తీసుకుని గుంటూరు సీఐడీ కోర్టులో ప్రవేశ పెట్టింది.  బెయిలు, రిమాండ్ విషయాలను పక్కన పెడితే.. పోసాని తన నటనతో ప్రేక్షకులను మెప్పించినట్లుగానే చట్టాన్ని, న్యాయవ్యవస్థను కూడా మెప్పించేయగలనని భావిస్తున్నట్లు కనిపిస్తోందని నెటిజనులు సెటైర్లు పేలుస్తున్నారు. గుండెనొప్పి డ్రామాను కడప రిమ్స్ వైద్యులు బట్టబయలు చేసిన తరువాత ఆయన ఇప్పుడు ఆత్మహత్య శరణ్యం అంటూ కన్నీళ్ల డ్రామాకు తెరతీసినట్లుందని అంటున్నారు. అయినా ఆత్మహత్యే శరణ్యం అంటూ ఏకంగా కోర్టులోనే చెప్పిన పోసాని కృష్ణ మురళిపై మరో కేసు నమోదు చేయాల్సి ఉంటుందని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.