ఈ నెల 29న కొండగట్టుకు జనసేనాని 

రామభక్త హనుమాన్ కు దేశంలో అనేక దేవాలయాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా హనుమంతుడికి భారీ సంఖ్యలో భక్తులున్నారు.. ఈ నేపథ్యంలో తెలంగాణ లోని కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం ప్రసిద్ధి పొందింది. కొండలు, లోయలు, సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు ప్రకృతి సౌందర్యంతో భక్తులను పర్యాటకులను ఆకర్షిస్తుంటుంది. పవన్, సాయి ధరమ్ తేజ్ వంటి సినీ హీరోలతో పాటు అనేక మంది రాజకీయ నేతలు కూడా స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ నెల 29న తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి రానున్నారు. వారాహి దీక్షలో ఉన్న పవన్.. కొండగట్టు అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టాక తొలిసారి కొండగట్టుకు వస్తున్న పవన్ కల్యాణ్ కు జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ వారాహి దీక్షలో ఉన్న విషయం తెలిసిందే. 11 రోజుల పాటు కొనసాగనున్న ఈ దీక్షలో భాగంగా పవన్ కేవలం పండ్లు, పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తున్నారు.
మరోవైపు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం మంగళగిరిలోని తన నివాసంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులతో భేటీ అయ్యారు. కార్పొరేషన్ చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఆయా కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు