పవన్ కళ్యాణ్ చెప్పులు మోస్తున్న వైసీపీ!

చాలా పాత కథ ఒకటి వుంది. కొంతమంది సన్యాసులు పాదయాత్ర చేస్తున్నారు. దారిలో వారికి ఒక సెలయేరు లాంటిది అడ్డం వచ్చింది. అందరు దాన్ని దాటి అవతలి గట్టుకు చేరాలి. ఇవతలి గట్టు మీద ఒక అందమైన యువతి నిల్చుని వుంది. ఆ యువతి సెలయేరు దాటడానికి భయపడుతోంది. తన భయాన్ని ఈ సన్యాసుల బృందం దగ్గర వ్యక్తం చేసింది. అప్పుడు వారిలో వున్న ఒక సన్యాసి ఆ యువతిని ఎత్తుకుని సెలయేరుని దాటించాడు. ఆ తర్వాత సన్యాసులందరూ ముందుకు వెళ్ళిపోయారు. అయితే, యువతిని ఎత్తుకుని వదిలిపెట్టిన సన్యాసి ప్రశాంతంగా నడుస్తున్నాడు. కానీ, మిగతా సన్యాసులు మాత్రం లోపల లోపల ఉడికిపోతున్నారు.. కుమిలిపోతున్నారు.. వాళ్ళలో వాళ్ళే గుసగుసలాడుకుంటున్నారు. అలా అందరూ మైళ్ళకు మైళ్ళు నడిచారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏదో బాధపడుతున్నారని అర్థం చేసుకున్న ఈ సన్యాసి, ఏమైందని వాళ్ళని అడిగాడు. అప్పుడు వాళ్ళందరూ ఈ సన్యాసి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మనం సన్యాసులం.. మనం ఆడవాళ్ళకి దూరంగా వుండాలి. వాళ్ళని అస్సలు తాకకూడదు. కానీ, నువ్వు మాత్రం ఆ అందమైన అమ్మాయిని ఎత్తుకుని మరీ సెలయేరుని దాటించావు.. ఇది మన సన్యాసుల సంఘానికే అవమానం.. నువ్వు చేసింది చాలా పెద్ద నేరం అన్నారు. అప్పుడు ఈ సన్యాసి చిన్నగా నవ్వి, ‘‘నేను ఆ యువతిని అక్కడే వదిలేశాను.. మీరు మాత్రం ఇంకా మోస్తూనే వున్నారు’’ అన్నాడు. దాంతో ఈ సన్యాసులందరికీ బుద్ధి వచ్చి లెంపలేసుకున్నారు.

ఇప్పుడీ స్టోరీ చెప్పడానికి ఒక కారణం వుంది.. అదేంటో ముందుముందు మీకే అర్థమవుతుంది. వైసీపీ నాయకులు, వైసీపీ సోషల్ మీడియా సైన్యం చాలామంది పవన్ కళ్యాణ్ చెప్పులు మోస్తూ తమ జన్మలను ధన్యం చేసుకుంటున్నారు. ప్రస్తుతం వారాహి దీక్షలో వున్న పవన్ కళ్యాణ్ చెప్పులను మోయడం ద్వారా సదరు వర్గాలు దీక్ష ద్వారా పవన్ కళ్యాణ్ సాధించే ఫలితంలో కొంత భాగం సొంతం చేసుకుంటున్నారు. 

పవన్ కళ్యాణ్ ఇటీవల ‘వారాహి దీక్ష’ పేరుతో ఒక దీక్షను ప్రారంభించారు. పదిరోజుల పాటు జరిగే ఈ కఠోర దీక్షను పవన్ కళ్యాణ్ శ్రద్ధాభక్తులతో చేస్తున్నారు. అయితే ఈ దీక్ష చేస్తున్న వాళ్ళు చెప్పులు ధరించాలో, ధరించాల్సిన అవసరం లేదో తెలియదుగానీ, పవన్ కళ్యాణ్ మాత్రం దీక్షా వస్త్రాలు ధరించి, చెప్పులు కూడా వేసుకుని కనిపిస్తున్నారు. చంద్రబాబు, పవన్, బీజేపీ కూటమి చేతిలో తుక్కుతుక్కుగా ఓడిపోయిన వైసీపీ వర్గాలకు పవన్ కళ్యాణ్‌ని విమర్శించడానికి ఒక పాయింట్ దొరికినట్టు అయింది. దీక్షలో వున్న పవన్ కళ్యాణ్ చెప్పులు వేసుకున్నారేంటి.. ఇది తప్పు కదా.. పాపం కదా అని కొంతమంది వైసీపీ నాయకులు, వైసీపీ స్పాన్సర్ చేస్తున్న సోషల్ మీడియా శ్రామికులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. ఈ వేస్టుగాళ్ళకి ఏ కారణమూ దొరక్క, ఇలా వాళ్ళకి ఎంతమాత్రం సంబంధం లేని కారణాన్ని పట్టుకుని ట్రోల్ చేస్తున్నారు. దీక్ష అనేది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అంశం. ఆయన చెప్పులు వేసుకుంటారో, వేసుకోరో వీళ్ళకి ఎందుకంట? దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ ఏ కొద్దిసేపో చెప్పులు వేసుకుంటున్నారు. ఈ వైసీపీ బ్యాచ్ మొత్తం ఆ చెప్పుల్ని నిరంతరం నెత్తిన పెట్టుకుని మోస్తున్నారు. మొదట చెప్పిన సన్యాసుల కథలోని సన్యాసులకి, వీళ్ళకి పెద్ద తేడా ఏమీ లేదు. కాకపోతే ఆ కథలో సన్యాసులు బుద్ధి తెచ్చుకుని లెంపలు వేసుకున్నారు. ఈ వైసీపీ సన్నాసులకు మాత్రం ఎప్పటికీ బుద్ధిరాదు.