సైకిల్ సారథి లోకేషే.. ఎనీ డౌట్?
posted on Jan 29, 2025 10:14AM
![](/teluguoneUserFiles/img/lokeshnara(2).webp)
దివంగత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని అధినేత చంద్రబాబు నాయుడు దిగ్విజయంగా ముందుకు నడిపించుకుంటూ వచ్చారు. అధికారం కోల్పోయిన ప్రతిసారి పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్తేజాన్నినింపుతూ.. పడిలేచిన కెరటంలా రెట్టించిన ఉత్సాహంతో అధికారంలోకి వస్తూ టీడీపీని బలమైన పార్టీగా నిలుపుతూ వచ్చారు. ఇటీవలి కాలంలో చంద్రబాబు వ్యూహాలకుతోడు ఆయన తనయుడు నారా లోకేశ్ వ్యూహాలుకూడా తోడుకావటంతో పార్టీ మరింత బలోపేతం అయింది. అయితే లోకేష్ ఈ స్థాయికి ఎదగడం అంత ఆషామాషీగా జరగలేదు. తండ్రి చాటు తనయుడిగా రాజకీయాలలో బుడిబుడి అడుగులు వేస్తున్న సమయంలోనే ఆ నడకను ఆపేయడానికి ప్రత్యర్థులు కుట్రలు పన్నారు. కుయుక్తులు పన్నారు. ఆయన ఆహార్యాన్నీ, ఆహారాన్ని, మేనరిజాలను ఇలా వేటినీ వదలకుండా విమర్శలు గుప్పించారు. చివరాఖరికి బాడీ షేమింగ్ కు కూడా వెనుకాడలేదు. అయితే ఉలి దెబ్బలకు శిల శిల్పంగా మారినట్లుగా ఆయన ఆ విమర్శల దాడిని తట్టుకుని ప్రజా నాయకుడిగా ఎదిగారు.
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పనితీరుని చూడలేని కబోది నాయకుల విమర్శల నుండి ఎదిగిన పరిణితి నారా లోకేష్. టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యతను స్వచ్ఛందంగా భుజానికి ఎత్తుకున్న నిబద్దత గల కార్యదక్షకుడు, క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం సైనికుడు నారా లోకేష్. నారా లోకేష్ నాయకత్వ పటిమ విషయంలో కానీ, సమస్యలను దీటుగా ఎదుర్కొని పరిష్కరించగలిగిన పరిణితి విషయంలో కానీ, పార్టీకి అన్నీ తానై దిశా నిర్దేశం చేయగలిగిన సమర్థత విషయంలో కానీ ఇప్పుడు ఎవరికీ ఎటువంటి అనుమానాలూ లేవు. సొంత పార్టీయే కాదు, ప్రత్యర్థి పార్టీలు సైతం ఇప్పుడు నారా లోకేష్ పరిణితి చెందిన నాయకుడనీ, ప్రజాభిమానం చూరగొన్న ప్రజా నాయకుడని అంగీకరిస్తున్నాయి. అలా అంచలంచెలుగా ఎదిగిన నారా లోకేష్ ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడిగానే కాదు తండ్రిని మించిన తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీకి భవిష్యత్ నాయకుడిగా మారారు. ప్రస్తుతం పార్టీని తన కనుసన్నల్లో నడుపుతూ కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. రాజకీయంగా .. పాలనాపరంగా అన్ని అంశాలపై మంచి పట్టును సంపాదించిన లోకేశ్.. కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే, అన్ని అంశాల్లో తన సమర్ధతను నిరూపించుకుంటున్న లోకేశ్.. ఇసుమంతైనా గర్వం లేకుండా ఎక్కడ నెగ్గాలో మాత్రమే కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన నేతగా తన రాజకీయ చతురతను, పరిణితిని ప్రదర్శిస్తున్నారు.
ప్రభుత్వంలో పాలనాపరంగానూ చంద్రబాబుకు తగ్గ తనయుడుగా లోకేశ్ అందరిచేత ప్రశంసలు పొందుతున్నారు. మంత్రిగా కొనసాగుతూ కూటమి ప్రభుత్వ పాలనలో కీలకంగా మారిన లోకేశ్ ను డిప్యూటీ ముఖ్యమంత్రిగా చూడాలని తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఆశపడుతున్నారు. దీంతో లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలంటూ వారు ఇటీవల పెద్ద ఎత్తున గళమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న సభా వేదికపైనే నేతలు లోకేశ్ కు డిప్యూటీ సీఎం విషయాన్ని ప్రస్తావించారు. అయితే, ఈ విషయం కూటమి ఐక్యతపై ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో పార్టీ అధిష్టానం అలర్ట్ అయింది. లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి విషయంపై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ నేతలకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆ విషయంపై మాట్లాడటం మానేశారు. అదే సమయంలో ఈ విషయంపై లోకేశ్ స్పందించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆనందడోలికల్లో ముంచేసింది. వాస్తవానికి డిప్యూటీ సీఎం పదవి చేపట్టడానికి లోకేశ్ కు అన్ని అర్హతలూ ఉన్నాయి.. కానీ, కూటమిలో విబేధాలు రాకూడదన్న ఉద్దేశంతో డిప్యూటీ సీఎం విషయంలో లోకేశ్ వెనక్కు తగ్గారు. మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం పదవి కంటే తాను తెలుగుదేశం కార్యకర్తగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడతానంటూ టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తిని తొలగించే ప్రయత్నం చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో లోకేశ్ పాత్ర కీలకమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూటమిని ముందుండి నడిపించినప్పటికీ.. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర జగన్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడటానికి కారణమైంది. జగన్ హయాంలో నాలుగేళ్లు ప్రతిపక్ష పార్టీల నేతలు, ప్రజలు ప్రభుత్వంకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు వెనకడుగు వేశారు. అలాంటి సమయంలో యువగళం పాదయాత్రతో లోకేశ్ ప్రజల్లోకి వెళ్లారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మొండి పట్టుదలతో లోకేశ్ పాదయాత్రను కొనసాగించారు. ప్రజలు సైతం లోకేశ్ కు తమ సమస్యలను చెప్పుకునేందుకు రోడ్డు పొడవునా బారులు తీరారు. దీంతో ఒక్కసారిగా జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. యువగళం పాదయాత్రే జగన్ పతనానికి బీజం పడేలా చేసింది. ఆ తరువాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూటమిని ముందుండి నడిపించడంలో విజయవంతం కావడంతో కూటమి ప్రభుత్వం అద్భుత విజయంతో అధికారంలోకి వచ్చింది.
లోకేశ్ ను అభిమానించే వారిలో టీడీపీ శ్రేణులతోపాటు ఏపీలో లక్షలాది మంది ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా చిన్న పిల్లలు, మహిళలు, యువకులు కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. తక్కువ కాలంలోనే ప్రజాదరణ కలిగిన నేతగా లోకేశ్ ఎదిగారు. చంద్రబాబు నాయుడు కొడుకుగానే కాకుండా.. తన సొంత సమర్ధతతో రాజకీయాల్లో లోకేశ్ రాణిస్తున్నారు. దీంతో ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి చేపట్టేందుకు అవకాశం రాకపోయినా రాబోయే కాలంలో లోకేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని టీడీపీ నేతలు అంటున్నారు.