ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు

బీజేపీ హైకమాండ్ ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో ఎన్డీయే కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం అత్యంత కీలకంగా మారిన సంగతీ తెలిసిందే. అటు తరువాత మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా కూటమి తరఫున చంద్రబాబు పాల్గొన్నారు.

ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొని బీజేపీ అభ్యర్థుల విజయానికి దోహదపడాల్సిందిగా బీజేపీ హైకమాండ్ చంద్రబాబును కోరింది. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. దేశంలోనే సీనియర్ మోస్ట్ నాయకుడైన చంద్రబాబు సేవలను వినియోగించుకోవాలని, ఢిల్లీ ప్రచారంలో ఆయన పాల్గొంటే అది పార్టీ విజయానికి దోహదం చేస్తుందని భావిస్తున్న బీజేపీ అధిష్ఠానం ఆయన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆహ్వానించింది. దీంతో ఆయన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. వచ్చే నెల 2వ తేదీన ఆయన ఢిల్లీలో తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాలలె బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారు.