‘నంది’కి మోక్షం వచ్చింది రామాహరీ!
posted on Nov 2, 2015 11:43AM

ఎట్టకేలకు నంది అవార్డులకు మోక్షం వచ్చింది. రాష్ట్ర విభజన ఉద్యమం ఊపు అందుకునే ముందు నంది అవార్డుల ప్రదానోత్సవాలు చాలా వైభవంగా సాగేవి. సినిమాలకు ఇవ్వడంతో మొదలైన ఈ ‘నంది’ అవార్డులు ఆ తర్వాత నాటక రంగానికి, టీవీ రంగానికి కూడా ఇవ్వడం ప్రారంభించారు. నంది అవార్డుల వెనుక వుండే పైరవీలు, ఆశ్రిత పక్షపాతం అనే విషయాల సంగతి అలా వుంచితే, ప్రభుత్వం తరఫున ఇచ్చే నంది అవార్డులంటే కళాకారులకు ఎంతో ఆసక్తి వుండేది. అయితే తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత నంది అవార్డులకు ప్రాధాన్యం తగ్గింది. ఎవరి ప్రభుత్వం అధికారంలో వున్నా ఉద్యమ సుడిగుండంలో చిక్కుకుని వుండటంతో నంది అవార్డుల గురించి కొంతకాలం ఎవరూ పట్టించుకోలేదు. చివరికి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నంది అవార్డుల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. అన్ని సంస్థలను రెండు రాష్ట్రాలూ పంచుకుంటున్నాయి. మరి ‘నంది’ని ఎవరు తీసుకెళ్ళి పోషిస్తారనే సందేహానికి చాలాకాలంపాటు సమాధానం దొరకలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వ వర్గాల నుంచి మాత్రం నందిని తాము పోషించే ప్రసక్తే లేదన్న సంకేతాలు వచ్చాయి. నంది అవార్డులలో సినిమా అవార్డులకే ఎక్కువ గ్లామర్. ఆ తర్వాత టీవీ అవార్డులకు స్థానం దక్కుతుంది. సినిమా పరిశ్రమ, టీవీ పరిశ్రమ కేంద్రీకృతమై వున్న తెలంగాణ ప్రభుత్వమే నంది అవార్డుల విషయంలో అనాసక్తిగా వుందన్న సమాచారం రావడంతో ఇక నంది అవార్డులకు కాలంచెల్లినట్టేన్న సందేహాలు వచ్చాయి. దీనికితోడు తెలంగాణ ప్రభుత్వం నంది బదులు ‘ఏకశిల’ పేరుతో అవార్డులు ఇవ్వబోతోందన్న వార్తలు కూడా రావడంతో ఇక తెలంగాణకు, నందికి సంబంధం లేదనుకోవాల్సి వచ్చింది.
అయితే ఇప్పుడు నందిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కున చేర్చుకుంది. గత కొన్నేళ్ళుగా మూలన పడి వున్న నంది అవార్డులకు ఏపీ ప్రభుత్వం మోక్షం కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నాటక రంగానికి నంది అవార్డులు ఇవ్వబోతున్నామంటూ ఏపీ ప్రభుత్వం తాజాగా దరఖాస్తులను ఆహ్వానించింది. నాటకాలకు అవార్డులు ఇస్తున్నారంటే, భవిష్యత్తులో సినిమాలకు, టీవీలకు కూడా అవార్డులు ఇవ్వడం అనేది ఖాయమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేసి నంది అవార్డులను పునరుద్ధరించడం సినిమా, టీవీ, నాటక రంగ కళాకారులకు సంతోషాన్ని కలిగిస్తోంది.