బీహార్ ఎన్నికలతో బుర్రలు వేడి



బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలేమోగానీ, ఈ ఎన్నికలు దేశంలోని రాజకీయ వర్గాల బుర్రలు వేడెక్కేలా చేస్తున్నాయి. ఐదు దశల్లో పోలింగ్ జరుగుతున్న ఈ ఎన్నికలు హిచ్‌కాక్ సినిమాల తరహాలో సస్పెన్స్‌తో కొనసాగుతూ చివరికి ఫలితాలు ఎలా వుండబోతున్నాయా అనే ఉత్కంఠ దశ దశకూ పెరిగిపోతోంది. దేశ సార్వత్రిక ఎన్నికలు ఎంతటి ఉత్కంఠభరితమైన వాతావరణంలో జరిగాయో ఇప్పుడు ఒక్క బీహార్ రాష్ట్ర ఎన్నికలే ఆ స్థాయి ఉత్కంఠతో జరుగుతున్నాయి.

బీహార్ ఎన్నికల సందర్భంగా ఇంత ఉత్కంఠ పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఈ ఎన్నికలు కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి సవాలుగా నిలిచేవి. ‘మోడీ గాలి’ ఇప్పటికీ ఉందా లేదా అని స్పష్టం చేసేవి. అందుకే ప్రధాని మోడీతో సహా బీజేపీ మిత్ర పార్టీలన్నీ బీహార్ మీద పూర్తి స్థాయి కృషిని కేంద్రీకరించాయి. ఈ ఎన్నికలలో ఏన్డీయే కూటమి ఓడిపోవడం అంటూ జరిగితే, అది మోడీ ప్రతిష్టకు మచ్చ అయ్యే ప్రమాదం వుంది. ఈ ఎన్నికలలో గెలుపు, ఓటముల ప్రభావం త్వరలో జరగబోయే పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల మీద పడే ప్రభావం వుంది. అందువల్ల బీజేపీ బీహార్ ఎన్నికలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

బీహార్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకముందు ఆ రాష్ట్రంలో బీజేపీకి విజయావకాశాలు తక్కువేనన్న అభిప్రాయాలు వినిపించాయి. ఎన్నికల సర్వేలు కూడా ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. ప్రజల్లో మంచి పేరు వున్న నితీష్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందని సర్వే ఫలితాలు వచ్చాయి. అయితే నాలుగోదశ పోలింగ్ ముగిసిన తర్వాత ఇప్పుడు రాజకీయ పరిశీలకులు భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. నాలుగోదశ పోలింగ్ జరిగిన దాదాపు అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశం వుందని అంటున్నారు. ఇది బీజేపీకి సీట్ల బలాన్ని పెంచుతుందని అంటున్నారు.

నితీష్ కుమార్ కూటమి తమదే విజయం అని భారీ ధీమాని ప్రదర్శిస్తున్నప్పటికీ లోలోపల ఎక్కడో బెరుకు కనిపిస్తోంది. ఎన్డీయే వర్గాలు మాత్రం సర్వే రిపోర్టులు ఎలా వున్నా గత సార్వత్రిక ఎన్నికల తరహాలోనే మోడీ మంత్రం బీహార్లో కూడా ఫలించే అవకాశం వుందని చెబుతున్నాయి. అయితే మరికొన్ని వర్గాలు మాత్రం ఈసారి బీహార్లో హంగ్ ఖాయమని నిర్మొహమాటంగా అంటున్నారు. ఇలా ఏ అంచనాకూ స్పష్టంగా అందని బీహార్ ఎన్నికల సరళి రాజకీయ పరిశీలకుల బుర్రల్ని వేడెక్కిస్తోంది. నంబర్ 8వ తేదీన ఫలితాలు వెలువడేవరకూ ఈ వేడి చల్లారే అవకాశం లేదు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu