ఇది ఆరంభం మాత్రమే, అధికార పార్టీకి అక్బర్ వార్నింగ్!

రైతు ఆత్మహత్యలపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ, కేటీఆర్ మధ్య జరిగిన వాగ్యుద్ధం కొత్త మలుపు తిరిగింది, మొన్నటివరకూ మజ్లిస్ మిత్రపక్షమేనని అనుకున్నవాళ్లంతా వీరిద్దరి గొడవ చూసి ఎక్కడో బెడిసికొట్టినట్లే ఉందని మాట్లాడుకుంటున్నారు, ప్రతిపక్ష నేత జానారెడ్డి మధ్యవర్తిత్వంతో అప్పటికి గొడవ సద్దుమణిగినా లాబీల్లోనూ కేటీఆర్ ను ఏకిపారేశారు ఓవైసీ, ప్రసంగం పూర్తికాగానే సభ నుంచి లాబీల్లోకి వచ్చిన అక్బరుద్దీన్ అక్కడ కూడా కేటీఆర్ ను వదల్లేదు, నిన్నటివరకూ ఏమీ తెలియని కేటీఆర్ నన్ను ప్రశ్నిస్తాడా అంటూ మండిపడ్డారు, కేటీఆర్ చెప్పినట్లు వినడానికి తానేమీ టీఆర్ఎస్ లీడర్ ని కాదని గుర్తుచేశారు.

తాను చావును చూసొచ్చానని, కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసన్నారు. అందుకే రైతుల ఆవేదనను సభలో చెప్పానని, దానిని అధికారపక్షం నేతలు అపహాస్యం చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు, రాష్ట్రంలో వర్షాలు సాధారణంగానే ఉన్నాయని, పంటలు సంతృప్తికరంగానే ఉన్నాయని ప్రభుత్వం తన నివేదికలో చెబుతోంది. పంటలు సంతృప్తిగా ఉంటే రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుందో ప్రభుత్వం చెప్పడం లేదన్నారు. ఇక ముఖ్యమంత్రి ఫామ్ హౌజ్ దగ్గర పడుతున్న వర్షాలు... సాధారణ రైతులకు ఎందుకు పడటం లేదో అర్థం కావడం లేదన్నారు. అదేవిధంగా కేబినెట్ సమావేశం తర్వాత రైతు కుటుంబాలకు పెంచిన నష్ట పరిహారం సెప్టెంబర్ నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి, అసెంబ్లీలో ఇచ్చిన నివేదికలో జూన్ రెండు నుంచి అమలు చేస్తామన్న ప్రతిపాదన అర్థం లేనిదన్నారు. ప్రభుత్వానికే స్పష్టత లేకుండా తనను ప్రశ్నించడమేమిటన్నారు.

అధికారపక్షంతోపాటు ఇటు ప్రతిపక్ష పార్టీలనూ కడిగిపారేశారు ఓవైసీ, రైతుల సమస్యలను ఎత్తి చూపడంలో టీడీపీ, కాంగ్రెస్ విఫలమయ్యాయన్న అక్బరుద్దీన్.... ప్రతిపక్షాలుగా సరైన పాత్ర పోషించడం లేదన్నారు. అయితే రైతు సమస్యలు, ఆత్మహత్యలపై టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ సభ్యులు మాట్లాడినప్పుడు పెద్దగా పట్టించుకోని అధికార పార్టీ, మిత్రపక్షం సభ్యుడు ఎత్తిచూపినప్పుడు మాత్రం తప్పు పట్టడం అసెంబ్లీలో హాట్ టాపిక్ గా మారింది