కేసీఆర్ కి రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసిన ఒవైసీ
posted on Sep 29, 2015 8:36PM
ఊహించని విధంగా తెలంగాణాలో తెరాస అధికారంలోకి రావడం కేసీఆర్ ముఖ్యమంత్రి అయిపోవడం జరిగింది. ఊహించని విధంగా అని ఎందుకంటే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి ఆ విజయం దక్కవలసి ఉంది. కానీ టీ-కాంగ్రెస్ నేతలు ఎన్నికలలో టికెట్స్ సంపాదించుకోవడంపై చూపినంత శ్రద్ద పార్టీని గెలిపించుకోవడంపై చూపకపోవడంతో తెలంగాణా సెంటిమెంటుతో తెరాస అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ కి వడ్డించిన విస్తరి వంటి రాష్ట్రం దొరికితే, చంద్రబాబు నాయుడుకు రాజధాని లేని కష్టాల రాజ్యం దక్కింది.
ఒకవేళ కేసీఆర్ కి ఆంద్రప్రదేశ్ వంటి కష్టాల రాజ్యం చేతికి అంది ఉండి ఉంటే దానిని చక్కదిద్దగలిగేవారో లేదో తెలియదు కానీ ఆర్ధికంగా బలంగా ఉన్న రాష్ట్రం దక్కింది కనుక సాధ్యాసాధ్యాలు గురించి ఆలోచించకుండా గాలిలో మెడలు కట్టడం మొదలుపెట్టేశారు. తను గాలిలో తేలిపోతూ ప్రజలకు కూడా రంగు రంగుల కలలు చూపిస్తున్నారు. తెలంగాణా ధనిక రాష్ట్రం కనుక ఏదయినా సాధ్యమేననే భ్రమ ప్రజలలో కల్పించారు. కానీ ఇంతవరకు తను చూపిన రంగుల కలలలో ఒక్కటీ కూడా నిజం చేసి చూపలేకపోయారు. మాటలు కోటలు దాటిపోతున్నాయి కానీ రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు.
తెలంగాణా ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకొన్నందుకు ఈరోజు శాసనసభలో ప్రతిపక్షాలు నిలదీస్తుంటే సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. “తెలంగాణా ధనిక రాష్ట్రమయినప్పుడు ఇంతవరకు రైతుల రుణాలు ఎందుకు మాఫీ చేయలేదు? ఒకేసారి మాఫీ చేయకుండా వాయిదాలలో ఎందుకు చేస్తున్నారు?” అని మజ్లీస్ సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ తెరాసను సభలో కడిగి పడేశారు. “అదే రాజశేఖర్ రెడ్డి ఉన్నట్లయితే ఒకే ఒక సంతకంతో అన్ని రుణాలు మాఫీ చేసేవారు. కానీ ధనిక రాష్ట్రమని చెప్పుకొంటున్న మీరెందుకు చేయలేకపోతున్నారు? లోపం మీలో ఉంచుకొని గత ప్రభుత్వాలను నిందిస్తూ ఇంకా ఎంత కాలం కాలక్షేపం చేస్తారు?”అని తెరాస ప్రభుత్వాన్ని నిలదీశారు.