అక్బరుద్దీన్ కి... కేసీఆర్ కొడుక్కి ఎక్కడ చెడింది?
posted on Sep 29, 2015 12:19AM
రైతుల ఆత్మహత్యలపై అక్బరుద్దీన్ ప్రసంగం ప్రారంభించగానే అధికారపక్ష సభ్యులు నవ్వడం దేనికి సంకేతం? కావాలనే ఓవైసీకి టీఆర్ఎస్ సభ్యులు కోపం తెప్పించారా? కేటీఆర్ అంత సీరియస్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సభ్యులు మాట్లాడినప్పుడు పెద్దగా పట్టించుకోని అధికార పార్టీ... ఓవైసీ మాటలను మాత్రం ఎందుకు అంత సీరియస్ గా తీసుకుంది, మజ్లిస్ తో వ్యవహారం చెడిందా? లేక అక్బరుద్దీన్ కి కేటీఆర్ కి మధ్య ఏమైనా తేడాలొచ్చాయా?
రైతు ఆత్మహత్యలపై మాట్లాడుతుండగా అధికార పార్టీ నేతలు నవ్వడంతో ఇదేనా మీ ప్రభుత్వానికున్న సీరియస్ అంటూ అక్బర్ ఫైరయ్యారు, దాంతో మధ్యలో కల్పించుకున్న కేటీఆర్... మేం సీరియస్ గానే ఉన్నాం... మీరే సీదాసీదా మాట్లాడండి అంటూ రివర్స్ అయ్యాడు, దాంతో సీదా అంటే ఏంటో చెప్పాలన్న ఓవైసీ, తానేమీ రైతుల గురించి తేడాగా మాట్లాడలేదన్నారు. అలా అక్బరుద్దీన్, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం సాగింది.
అయితే లాబీల్లో మీడియాతో చిట్ చాట్ చేసిన ఓవైసీ.... కేటీఆర్ తోపాటు
ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా ఓవైసీ సెటైర్లు వేశారు, అసెంబ్లీలో ఓవైసీ, కేటీఆర్ మధ్య హాట్ హాట్ గా మాటల యుద్ధం జరిగాక.... లాబీల్లోకి వచ్చిన అక్బరుద్దీన్... తండ్రీకొడుకులపై పంచ్ డైలాగ్స్ వదిలారు, కేసీఆర్ ఫాంహౌస్ లో కురుస్తున్న వర్షాలు... తెలంగాణ మొత్తం ఎందుకు కురవడం లేదో అర్థంకావడం లేదంటూ వెటకారమాడిన ఓవైసీ... ఎకరానికి కోటి రూపాయలు ఆదాయమెలా వస్తుందో రైతులందరికీ చెబితే బాగుంటుందన్నారు
అయితే కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓవైసీ మాటలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్లకి గట్టిగానే రిటార్ట్ ఇచ్చాడు.... కేసీఆర్, కేటీఆర్ లకు మీరు తానా అంటే తందాన అనుకోండి గానీ, తాను అనాల్సిన అవసరం లేదంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు, అయితే ఈ వివాదం ఇక్కడితోనే ముగుస్తుందా? లేక ఇదే దూకుడును ఓవైసీ కొనసాగిస్తారో చూడాలి.