హరీష్ రావుతో సన్నిహితంగా ఉన్నందుకేనట!

 

వరంగల్ ఉప ఎన్నికలు తెరాసలో హరీష్ రావు ఏకాకి అయ్యారనే విషయం బయటపెట్టాయి. ఆయన అనుచరుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ వరంగల్ ఉప ఎన్నికలలో పోటీ చేయాలనుకొన్నారు. హరీష్ రావు సూచన మేరకే ఆయన గత ఆరు నెలలుగా తరచూ వరంగల్ పర్యటిస్తూ, అక్కడి నేతలు, కార్యకర్తలతో పరిచయాలు పెంచుకొన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం ఆయన పేరును పరిశీలనలోకి కూడా తీసుకోలేదు. అతను జిల్లాకు చెందిన వ్యక్తి కాదని పక్కన పెట్టేసారు. కానీ అసలు కారణం ఆయన హరీష్ రావు అనుచరుడు కావడమేనని తెరాస నేతలే అనుకొంటున్నారుట. అంటే హరీష్ రావుతో సన్నిహితంగా మెలిగినవారు ఆయనతో బాటు పార్టీలో ఒంటరి అయిపోతారని చెప్పకనే చెప్పినట్లయింది.

 

కేసీఆర్ తన కుమారుడు కె. తారక రామారావుని తన వారసుడిగా ముందుకు తీసుకురావాలనుకొంటే అదేమీ అసహజమయిన విషయం కాదు. హరీష్ రావుని కూడా ఒకానొకప్పుడు ముఖ్యమంత్రి పదవి ఆశించడం, పార్టీలో కేసీఆర్ తరువాత స్థానం ఆశించడం రహస్యమేమీ కాదు. కనుక హరీష్ రావు నుండి తన కొడుకు కె. తారక రామారావుకి ఎన్నడూ సవాలు ఎదురవకూడదనే ఉద్దేశ్యంతోనే, ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావును పార్టీలో ఏకాకిగా చేస్తున్నట్లుంది. ఎర్రోళ్ల శ్రీనివాస్ కి వరంగల్ ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలని హరీష్ రావు ముఖ్యమంత్రి కేసీఆర్ ని గట్టిగా అడిగారో లేదో తెలియదు కానీ శ్రీనివాస్ అభ్యర్దిత్వాన్ని నిర్ద్వందంగా తిరస్కరించడం ద్వారా అతనిని బలపరుస్తున్న హరీష్ రావుని తిరస్కరించినట్లయింది.

 

అసెంబ్లీ సమావేశాలు జరుగుతునప్పుడు, ఎన్నికల సమయంలో హరీష్ రావును బాగానే వాడుకొనే కేసీఆర్, ఆయన అనుచరుడికి టికెట్ ఈయవలసివచ్చినపుడు ఈవిధంగా తిరస్కరించడం విస్మయం కలిగిస్తోంది. హరీష్ రావు ఇంతవరకు ఎప్పుడూ కూడా పార్టీ అధిష్టానంపై తన అసంతృప్తి వ్యక్తం చేయలేదు. కానీ ఇదేవిధంగా ఆయనతో పార్టీ వ్యవహరిస్తున్నట్లయితే ఏదో ఒకరోజు తన దారి తను చూసుకోవచ్చును.