అందమైన వివాదం.. మిస్ వరల్డ్ చుట్టూ దుమారం

మన దేశం మరో మారు  మిస్ వరల్డ్  (ప్రపంచ సుందరి) పోటీలకు వేదిక అవుతోంది.  అది కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.  మే 7 నుంచి 31 వరకు  హైదరాబాద్ నగరంలో నిర్వహించే ఈ అందాల పోటీలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.  

ఇంచు మించుగా,నెల రోజుల పాటు జరిగే ఈ పోటీలలో 140 దేశాల అందాలు భామలు పాల్గొంటారు. ఆ 140 దేశాల అందాల భామలు హైదరాబాద్ లో కురిపించే  అందాలను  కెమేరాతో పట్టుకుని   ప్రపంచానికి చూపేందుకు మూడు వేల టీవీ ఛానల్స్  నెల రోజుల పాటు  హైదరాబాద్  నగరంలో విడిది చేస్తాయి. ఈ మూడు వేల టీవీ ఛానల్స్  రాక పోకలు ఎలాంటి అవరోధాలు లేకుండా సాఫీగా సాగేందుకు అవసరమైన అనుమతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీ వెళ్లి విదేశాంగ మంత్రి జయశంకర్ తో మంతనాలు జరిపి  వచ్చారు. దీంతో ప్రపంచ సుందరి  పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుస్తోంది. 

అంతే  కాదు  ప్రపంచ సుందరి పోటీలకు తమ ప్రభుత్వం ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నదో కూడా ముఖ్యమంత్రి స్వయంగా శాసన సభకు వివరించారు. ఇది అలాంటి ఇలాంటి వేడుక కాదు, ఇతవరకు 72 సార్లు  ప్రపంచ సుందరి పోటీలు నిర్వహిస్తే ఒకే ఒక్క సారి 1998లో  మన దేశంలో బెంగుళూరులో నిర్వహించారు. అదికూడా అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ (ఏబీసీ) సంస్థ నిర్వహించింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పడు మా ప్రభుత్వమే ప్రపంచ సుందరి  పోటీలు నిరహిస్తోందని సగర్వంగా సభకు తెలిపారు. (ముఖ్యమంత్రి ఎందుకు ప్రస్తావించలేదో ఏమో కానీ, లాస్ట్ ఇయర్, 2024 లోనూ మన దేశంలో  ముంబై/ ఢిల్లీలోనే మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. సరే అది వేరే విషయం.) ఈ పోటీలను ఇక్కడ హైదరాబాద్’లో  నిర్వహించడం వలన రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని,అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ సుందరి పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, నిర్ణయించిందని వివరించారు. 

అయితే ఎప్పుడో జరిగే అందాల పోటీల విషయం ఎలా ఉన్నా ఇప్పుడది, రాష్ట్ర  రాజకీయాల్లో మరో వివాదానికి తెర తీసింది. పెద్ద దుమారాన్నే రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రపంచ సుందరి పోటీలను హైదరాబాద్ లో నిర్వహించడం  ద్వారా  పర్యాటక రంగం పరుగులు తీస్తుందని, అంటుంటే, ప్రధాన ప్రతి పక్ష పార్టీ బీఆర్ఎస్  మాత్రం  అందాల పోటీల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ధనాన్ని వృధా చేస్తోందని ఆరోపిస్తోంది. అసలే రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలో అందాల పోటీలా ...?  అంటూ ప్రశ్నలు సంధిస్తోంది. బీఆర్ఎస్  కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పోటీల నిర్వహణకు రూ.200 కోట్ల ప్రజాధనం ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ఆరోపించారు.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రూ.46 కోట్లు ఖర్చుచేసి  ఫార్ములా - ఈ కార్  రేస్ నిర్వహిస్తేనే  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందులో ఏదో జరిగిపోయిందని  ఏసీబీ కేసులు పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే  కేవలం రూ.46 కోట్లతో  ప్రపంచంలోనే ప్రప్రధమంగా ఫార్ములా - ఈ  రేస్  నిర్వహిం చడమే తప్పయితే, రూ.200 కోట్లు ఖర్చు చేసి అందాల పోటీలు నిర్వహించడం ఎలా రైట్  అవుతుందని బీఆర్ఎస్ నేతలు లాజికల్ గా  ప్రశ్నిస్తున్నారు.

సరే.. అదలా ఉంటే, ఇందులో ఇంకొక సీరియస్ కోణం వుందని అంటున్నారు. 1998లో అమితాబచ్చన్ కార్పొరేషన్ (ఏబీసీ) బెంగుళూరులో ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు చాలా  పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.  మహిళా సంఘాల నిరసనలు, ఆత్మాహుతి ప్రయత్నాల కారణంగా స్విమ్ సూట్’ ఈవెంట్ ను రద్దు చేయడం కూడా జరిగిందని  గుర్తు చేస్తున్నారు.అంతే కాదు  చిత్రంగా, ప్రగతిశీల వామపక్ష మహిళా సంఘాలు, హిందూ జాతీయ వాద మహిళా సంఘాలు ఒకే గొంతుకతో  నిరసన గళం వినిపించాయి. అయితే, ఇప్పడు మళ్ళీ అలాంటి పరిస్థితి పునరావృతం అవుతుందా? శాంతి భద్రతల సమస్య వస్తుందా, అంటే చెప్పలేము. అయితే ఇటీవల ఉత్తర ప్రదేశ్, ప్రయాగ రాజ్ లో 45 రోజుల పాటి సాగిన మహా కుంభ మేళ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సాగిన మాటల యుద్ధం, తీవ్ర రాజకీయ దుమారన్నిరేపింది. ఆ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సహా పలువురు నాయకులు, సనాతన హిందూ ధర్మాన్ని తూలనాడుతూ చేసిన వ్యాఖ్యలు  అందుకు వ్యతిరేకంగా బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థల నాయకులు, కాంగ్రెస్ పార్టీని హిందూ వ్యతిరేక, సనాతన ధర్మ వ్యతిరేక పార్టీగా చిత్రీకరిస్తూ చేసిన ప్రతి విమర్శలు కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా కొంత ఇబ్బందికి గురిచేశాయి అనే అభిప్రాయం వుంది. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, కుభమేళ ప్రభావం కొంత మేర ఉందనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లోఉంది. ఈ నేపధ్యంలో భారతీయ, సనాతన సంస్కృతీ, సంప్రదాయాలకు విరుద్ధమనుకునే మిస్ వరల్డ్ అందాల పోటీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించడం పై బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు ఎలా స్పందిస్తాయి.. కాంగ్రెస్ ఆదిస్థానం ఎలా రియాక్ట్ అవుతుంది అనేవి ఇప్పడు మిస్ వరల్డ్ ముందున్న ప్రశ్నలు. అలాగే  ఈ అందాల వివాదం  చిలికి చిలికి వికృతంగా వికారంగా మారుతుందా, లేక  లాస్ట్ ఇయర్ లాగా,  కూల్ గా సర్దు మణిగి పోతుందా  అనేది ముందు ముందు గానీ తెలియదు.