చంద్రబాబు సర్కార్ కి నలుగురు గౌరవ సలహాదారులు

వివిధ రంగాల్లో నిష్ణాతులైన నలుగురు ప్రముఖులను ఆంధ్రప్రభుత్వం ప్రభుత్వం గౌరవ సలహాదారులుగా నియమించింది. స్పేస్‌ టెక్నాలజీకి ఇస్రో మాజీ ఛైర్మన్‌ శ్రీధర ఫణిక్కర్‌ సోమనాథ్, ఏరోస్పేస్, డిఫెన్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌కి కేంద్ర రక్షణశాఖ సలహాదారు సతీష్‌రెడ్డి, చేనేత, హస్తకళల అభివృద్ధికి ప్రముఖ పారిశ్రామికవేత్త, భారత్‌ బయోటెక్‌ సంస్థ ఎండీ సుచిత్ర ఎల్ల, ఫోరెన్సిక్‌ సైన్స్‌ రంగానికి ప్రముఖ ఫోరెన్సిక్‌ శాస్త్రవేత్త కేపీసీ గాంధీలను కేబినెట్‌ హోదాతో గౌరవ సలహాదారులుగా నియమిస్తూ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. వీరు రెండేళ్లపాటు  ఆ పదవుల్లో ఉంటారు.

సుచిత్ర ఎల్ల భారత్‌ బయోటెక్‌ సంస్థ సహ వ్యవస్థాపకురాలు. భారత్‌ బయోటెక్‌తోపాటు, ఎల్ల ఫౌండేషన్‌కు ఎండీగా వ్యవహరిస్తున్నారు. కొవిడ్‌ మహమ్మారికి వ్యాక్సిన్‌ను అందించడంతో పాటు, బయోటెక్నాలజీ రంగంలో చేసిన విశేష కృషికిగాను 2022లో భర్త డాక్టర్‌ కృష్ణ ఎల్లతో సంయుక్తంగా పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆమె టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలిగానూ సేవలందిస్తున్నారు. పారిశ్రామిక, సామాజిక సేవా రంగాల్లో ఆమె చేస్తున్న సేవలకు గుర్తింపుగా సౌండ్‌ ఇండియా బిజినెస్‌ అచీవర్స్‌ అవార్డ్, సార్క్‌ ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ అవార్డ్‌ వంటి అనేక పురస్కారాలు వరించాయి.

జి.సతీష్‌రెడ్డి ప్రముఖ రక్షణ రంగ శాస్త్రవేత్త. సిస్టమ్స్‌ మేనేజర్‌. గతంలో రక్షణ మంత్రికి శాస్త్ర సలహాదారుగా పనిచేశారు. డీఆర్‌డీఓ ఛైర్మన్‌గా, డీడీఆర్‌డీ కార్యదర్శిగా, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిస్సైల్స్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ సిస్టమ్స్‌గా అత్యంత కీలక పదవులు నిర్వహించారు. మిషన్‌శక్తి, లాంగ్‌రేంజ్‌ గైడెడ్‌ బాంబ్, క్షిపణి సాయంతో టార్పెడో విడుదల వ్యవస్థల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. లండన్‌లోని రాయల్‌ ఏరోనాటికల్‌ సొసైటీ సభ్యత్వంతోపాటు అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటిక్స్, ఆస్ట్రోనాటిక్స్‌ మిస్సైల్‌ సిస్టమ్స్‌ అవార్డు, ఏరోనాటికల్‌ ప్రైజ్, నేషనల్‌ సిస్టమ్స్‌ గోల్డ్‌మెడల్, నేషనల్‌ డిజైన్‌ అవార్డ్, హోమీబాబా గోల్డ్‌మెడల్‌ సహా మరెన్నో పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం రక్షణశాఖ సలహాదారుగా ఉన్నారు.

డాక్టర్‌ కేపీసీ గాంధీ ప్రముఖ ఫోరెన్సిక్‌ సైన్స్‌ శాస్త్రవేత్త. గతంలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, జమ్ము కశ్మీర్‌ రాష్ట్రాల ఫోరెన్సిక్‌ సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించారు. 1970లో ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో చేరారు. సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ లో పనిచేసి ఫోరెన్సిక్‌ దర్యాప్తులో నైపుణ్యం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రయోగశాల డైరెక్టర్‌గా సుదీర్ఘకాలం పనిచేసి అక్కడే పదవీ విరమణ చేశారు. ఫోరెన్సిక్‌ సైన్స్‌కు సంబంధించి సొంతంగా ట్రూత్‌ ల్యాబ్స్‌ను స్థాపించారు. ప్రస్తుతం దానికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ స్పేస్‌ టెక్నాలజీ రంగ గౌరవ సలహాదారుగా నియమితులైన శ్రీధర్‌ ఫణిక్కర్‌ సోమనాథ్‌కు ఈ రంగంలో 40 ఏళ్ల విశేష అనుభవముంది. 2022 జనవరి నుంచి 2025 జనవరి వరకు ఇస్రో ఛైర్మన్‌గా పనిచేశారు. అంతకు ముందు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌కు కార్యదర్శిగా పనిచేశారు. స్పేస్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం విక్రమ్‌ సారాభాయి స్పేస్‌ సెంటర్‌లో ప్రొఫెసర్‌గా ఉన్నారు.