ఛత్తీస్గఢ్ లో ఎన్ కౌంటర్.. 22 మంది మావోలు మృతి!

ఛత్తీస్గఢ్ లో గురువారం మార్చి ఉదయం జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో 22 మందిమావోయిస్టులు హతమయ్యారు. రాష్ట్రంలోని బీజాపూర్, దంతెవాడ సరిహద్దుల్లోని గంగలూరు ఆంఢ్రీ అడవులలో  ఈ ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఒక జవాన్ కూడా మరణించినట్లు చెబుతున్నారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఛత్తీస్ గఢ్ అటవీ ప్రాంతాల్లో భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు జరుగుతుండటంతో తరచూ ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి.

వచ్చే ఏడాది మార్చి కల్లా దేశాన్ని నక్సల్ ముక్త దేశంగా చూడాలన్నదే తమ లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఏడాది జనవరి 6న ప్రకటించారు. అప్పటి నుంచే దండకారణ్యంలో పోలీసు యాక్షన్ ముమ్మరమైంది. కూంబింగ్ ఆపరేషన్ ఎడతెగకుండా సాగుతోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి9న జరిగిన భారీ ఎన్ కౌంటర్లో 31 మంది మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే.   
తాజాగా గురువారం (మార్చి 20)  ఉదయం కూంబింగ్ జరుపుతున్న భద్రతా దళాలకు మావోయిస్టులు ఎదురు పడ్డారు. దీంతో ఇరు పక్షాల మధ్యా కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో  22 మంది మావోయిస్టులు మరుణించారు. ఘటనాస్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.    దేశంలో మావోయిస్టు పార్టీలను వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తిగా నిర్మూలిస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శపథంలో భాగంగా గత ఏడాది జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైంది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇప్పటి వరకు 300లకు పైగా మావోయిస్టులు హతమైనట్లు కేంద్ర హోంశాఖ అధికారులు చెబుతున్నారు.

కాగా తాజా ఎన్ కౌంటర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా  సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఆ పోస్టులో  మన సైనికులు నక్సల్ ముక్త భారత్ అభియాన్ దిశగా ఒక గొప్ప ముందడుగు వేశారని పేర్కొన్నారు.  మోడీ  ప్రభుత్వం నక్సలైట్లపై కఠినమైన విధానంతో ముందుకు సాగుతోంది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి దేశం నక్సల్ రహితంగా ఉంటుంది. అనే పేర్కొన్నారు.