కొనసాగుతున్న కలెక్షన్ల సునామీ.. భైరవ దూకుడికి బ్రేక్‌ వేసేవారు కనుచూపు మేరలో లేరా?

ప్రపంచవ్యాప్తంగా ‘కల్కి’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఒకే టాక్‌తో కొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. క్రికెట్‌ మ్యాచ్‌ జరిగే రోజు సాధారణంగా సినిమాలకు కలెక్షన్లు తక్కువగా ఉంటాయి. కానీ, కల్కి మాత్రం దానికి భిన్నంగా రికార్డుల మోత మోగిస్తోంది. దేశవ్యాప్తంగా హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌ సాధిస్తోంది. అమెరికాలో ఇప్పటికే 11 మిలియన్‌ డాలర్లు వసూలు చేసి ఎవ్వరూ అందుకోలేని రికార్డును క్రియేట్‌ చేసింది. అంతేకాదు, నార్త్‌ ఇండియాలోనూ ‘కల్కి’ తన దూకుడును కొనసాగిస్తోంది. నాలుగు రోజుల్లో రూ.115 కోట్లకు పైగా కలెకన్ట చేసి ట్రేడ్‌ వర్గాలకు సైతం షాక్‌ ఇస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.550 కోట్లకుపై గ్రాస్‌ కలెక్ట్‌ చేసిన ‘కల్కి’ మొదటి వారం పూర్తయ్యేసరికి రూ.1000 కోట్ల మార్క్‌ను దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. 

ఇక ఆన్‌లైన్‌ బుకింగ్స్‌లో కూడా ‘కల్కి’ తన స్పీడ్‌ను కొనసాగిస్తోంది. ఎంత పెద్ద సినిమాకైనా మొదటి వీకెండ్‌ పూర్తయిన తర్వాత సోమవారం ఎంతో కీలకమైన రోజుగా భావిస్తారు. ఆరోజు కలెక్షన్స్‌ బాగుంటే సినిమా నిలబడినట్టేనని ఎన్నో సినిమాలు ప్రూవ్‌ చేశాయి. ‘కల్కి’ విషయానికి వస్తే సోమవారం కూడా ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ బాగున్నాయని తెలుస్తోంది. గత మూడు రోజులుగా సగటున గంటకు 95 వేలకుపైగా బుక్‌ మై షో టికెట్లు సేల్‌ అవడం ఆ యాప్‌ చరిత్రలోనే సరికొత్త రికార్డు అంటున్నారు. సినిమా చూడాలన్న ఉత్సాహం ఆడియన్స్‌లో బాగా ఉండడం వల్లే థియేటర్‌కి వెళ్ళి డిజప్పాయింట్‌ అవ్వకుండా ముందుగా టికెట్స్‌ బుక్‌ చేసుకున్న తర్వాతే బయటికి వస్తున్నారు. 

ప్రస్తుతం కనిపిస్తున్న కలెక్షన్‌ లెక్కలు చూస్తుంటే ఇప్పట్లో ‘కల్కి’ కలెక్షన్లు తగ్గే సూచన కనిపించడం లేదు. వచ్చేవారం కూడా సరైన సినిమా థియేటర్లలో రిలీజ్‌ అయ్యే అవకాశం లేకపోవడం ఈ సినిమాకి పెద్ద ప్లస్‌గా మారింది. టికెట్స్‌ రేట్లు పెంచినప్పటికీ అది సినిమా కలెక్షన్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల రేట్లను రెండు వారాల వరకు పెంచుకునే సదుపాయం కల్పించడంతో అక్కడి కలెక్షన్ల ఫిగర్స్‌కు రెక్కలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రెండు వారాల తర్వాత టికెట్స్‌ రేట్లు తగ్గినా ఆక్యుపెన్సీకి ఎలాంటి ఢోకాలేదని ట్రేడ్‌వర్గాలు చెబుతున్నాయి.