చిల్లర సమస్య తీర్చలేక... అల్లరి పాలవుతోన్న ఏపీ పర్స్!
posted on Dec 8, 2016 10:51AM

ఏపీ పర్స్ ... దీని గురించి మీరు విన్నారా? స్వయంగా చంద్రబాబే జనంలోకి తెచ్చారు ఈ మొబైల్ యాప్ ని! అందుక్కారణం, ప్రస్తుత డీమానిటైజేషన్ గందరగోళంలో ఇది ఎంతో మేలు చేస్తుందని ప్రచారం జరగటమే. ఇక జనం కూడా ఆసక్తిగా వెయిట్ చేశారనే చెప్పొచ్చు. ఒకవైపు చేతిలో చిన్న నోట్లు లేక, పెద్ద నోట్లు చెల్లక నెల రోజులుగా అంతా నానా తంటాలు పడుతున్నారు. అందుకే, ఆంద్రా ప్రభుత్వం మొబైల్ యాప్ తో మనీ ట్రాన్స్ ఫర్ అనగానే అందరికీ ప్రాణాలు లేచి వచ్చాయి. ఇది ఏటీఎంలు, బ్యాంక్ ల వద్ద పడిగాపుల్ని కొంతైనా తగ్గిస్తుందనుకున్నారు. కాని, తాజాగా విడుదలైన ఏపీ పర్స్ రివ్యూయర్స్ దగ్గర్నుంచీ తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటోంది. ఒట్టి ఖాళీ పర్సని చిరాకు పడుతున్నారు డౌన్ లోడ్ చేసుకున్న వారు...
నోట్ల రద్దుతో ఆన్ లైన్ కార్యకలాపాలు ఇప్పుడు అనివార్యం అయిపోయాయి. అదే సమయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టాయి. తెలంగాణ ప్రభుత్వం టీఎస్ వాలెట్ అంటూ యాప్ ను తెచ్చే పనిలో వుండగానే ఏపీ గవర్నమెంట్ పర్స్ అంటూ ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఇక పై ఈజీగా కరెంట్ బిల్లు, మున్సిపల్ బిల్లు, బ్రాడ్ బ్యాండ్ బిల్లు లాంటి చెల్లింపులు చేసుకోవచ్చని అంతా భావించారు. హార్డ్ క్యాష్ లేక జనం పడుతోన్న హార్డ్ ట్రబుల్స్ తప్పుతాయనుకున్నారు. కాని, ఏపీ పర్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్న ఇనీషియల్ యూజర్స్ అప్పుడే పెదవి విరుస్తున్నారు. అసలు ఇందులో ఏ చెల్లింపుకి కూడా డైరెక్ట్ ఛాన్స్ లేదని విమర్శిస్తున్నారు. ప్రతీది లింక్ ను పట్టుకుని వెళ్లి డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం 28లింక్ లు దేనికది డౌన్ లోడ్, ఇన్ స్టాల్ చేసుకోవాల్సిందే. ఆ పని తాము ఏపీ పర్సు లేకుండా కూడా చేసుకుంటాం కదా అంటున్నారు!
పర్స్ ఉపయోగించిన వారు అందులో ఏం లేదని చెప్పటమే కాక చంద్రబాబు దీని పై తగినంత దృష్టి పెట్టలేదని భావిస్తున్నారు. ఆయన స్వయంగా ఈ యాప్ ను వాడి చూడాల్సిందని అంటున్నారు. అప్పుడే ఇది టైమ్ వేస్ట్ వ్యవహారమని ఆయన గ్రహించే వారంటున్నారు. అసలు యాప్ ను డెవలప్ చేయటానికి ఉద్దేశించిన టీమ్ ఏ మాత్రం మనసు పెట్టలేదని అంటున్నారు. అందువల్లే ఏపీ పర్స్ ప్రచారమంతా ఓన్లీ హంగామాగా మిగిలిందంటున్నారు.
జనం రోజుల తరబడి బ్యాంక్ ల వద్ద, ఏటీఎంల కాళ్లు వణికేలా క్యూల్లో నిలబడుతున్నారు. అటువంటి సమయంలో వాళ్లని ఫ్రస్ట్రేట్ చేసేలా ఇలా ఖాళీ పర్సులు తీసుకురావటం నిజంగా బాధాకరమే. దీనికి ఎక్కడ జరిగిన లోపం కారణమో తెలుసుకుని... ఏపీ గవర్నమెంట్ వెంటనే తప్పుని సరిదిద్దుకోవాలి. ఎందుకంటే, స్వయంగా ముఖ్యమంత్రి ఈ యాప్ జనం చిల్లర సమస్యలు తీరుస్తుందని చెప్పాక కూడా ... అది ఫెయిలైతే చాలా ఇబ్బందికరంగానే వుంటుంది!