కొడాలి నానికి గుండెలో మూడు బ్లాక్స్.. ఫోన్ లో జగన్ పరామర్శ..

అస్వస్థతతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిని వైసీపీ అధినేత జగన్ ఫోన్ లో పరామర్శించారు. తీవ్ర అస్వస్థతకు గురైన కొడాలి నానికి బుధవారం (మార్చి 26) ఉదయం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అక్కడ కొడాలి నానికి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని తేల్చారు.

వైద్య పరీక్షల్లో కొడాలి నానికి గుండెకు సంబంధించి మూడు వాల్వ్స్ బ్లాక్ అయ్యాయని గుర్తించారు. ఆయనకు శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఫోన్ లో కొడాలి నానిని పరామర్శించారు. అధైర్య పడవద్దంటూ ధైర్యం చెప్పారు. అలాగే వైద్యులను నాని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఇలా ఉండగా.. వివిధ కేసుల్లో అరెస్టై జైలు పాలైన వారిని స్వయంగా వెళ్లి పరామర్శించిన జగన్ అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన కొడాలిని పరామర్శించేందుకు ఆస్పత్రికి రాకపోవడమేంటని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.