బస్టాండ్‌లు ఎత్తుకెళ్తున్న బాహుబలులు
posted on Mar 30, 2025 8:13AM

శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తాడు.. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని పెకలించి తీసుకొచ్చాడు.. ఇవన్నీ పురణాల్లో విన్నాం.. అయితే బెంగళూరులో దొంగలు బాహుబలి అవతారమెత్తి బస్టాండ్‌లకు బస్టాండులనే ఎత్తుకుని పోతున్నారంట. సిలికాన్ సిటీ బెంగళూరులో ఆ విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడూ జనాలతో రద్దీ ఉండే ఓ బస్టాప్ ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. హఠాత్తుగా ఇలాంటి విచిత్రమైన ఘటన జరగడంతో రోజూ అక్కడొచ్చి బస్సెక్కే ప్రయాణీకులు ఆశ్చర్యపోతున్నారు. రోడ్డుపై బస్టాండ్ కనిపించకుండా పోయిందని తెలిసి నోరెళ్లబెడుతున్నారు. ఇందుకు కారణమేంటో తెలియక భయాందోళనలతోఉక్కిరిబిక్కి రవుతున్నారు. ఎందుకంటే కేవలం ఒక్క బస్టాప్ మాత్రమే కాదు. సిటీలో చాలాచోట్ల బస్టాండ్లు ఒకదాని తర్వాత మరొకటి మాయమైపోతున్నాయి మరి.
చాలా ప్రాంతాల్లోలాగే బెంగళూరు కూడా బైక్ దొంగతనాలు, పిక్ పాకెటింగ్, ఇళ్లలో దొంగతనాలు సర్వసాధారణంగా జరుగుతుంటారు. కానీ, ఇప్పుడా జాబితాలోకి బెంగళూరులోని బీఎంటీసీ బస్ స్టాప్ కూడా చేరింది. విచిత్రంగా బస్టాండ్లపై కన్నేసారు బెంగళూరు దొంగలు. బీబీఎంపీ నిర్మించిన అనేక బస్ షెల్టర్లను ఒకటొకటిగా లేపేస్తున్నారు. ఆ బహుబళులు. నిత్యం జనాలతో నిండి ఉండే ప్రాంతాల్లో ఈ దొంగతనాలు చోటు చేసుకోవడమే అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఈ వరస బస్టాప్ దొంగతనాలపై కార్పొరేషన్ చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్‌కు, బెంగళూరు నగర పోలీసు కమిషనర్ దయానంద్‌కు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన బస్ షెల్టర్ల విషయమై త్వరగా దర్యాప్తు చేయాలని కోరారు.
విజయనగరంలోని గోవిందరాజనగర్ వార్డులో అనేక బస్ స్టాప్‌లు అదృశ్యమయ్యాయి. లేఅవుట్ లోని 14వ కూడలిలో సర్వజ్ఞ స్కూల్ ముందు ఉండే బస్ షెల్టర్ కూడా మాయమైంది. ఈ బస్ షెల్టర్‌ను ఐదు సంవత్సరాల క్రితం రూ.16 లక్షల రూపాయల ఖర్చు చేసి నిర్మించారు. నగరంలో నిర్మించిన మొట్టమొదటి హైటెక్ బస్ షెల్టర్‌గా కూడా ఇది ప్రసిద్ధి పొందింది. ఈ స్టేషన్ గుండా ప్రతిరోజూ దాదాపు 200 బస్సులు తిరుగుతాయి. ఎప్పుడు ప్రయాణీకులతో రద్దీగా ఈ బస్టాప్ దాదాపు నెల రోజుల క్రితం అకస్మాత్తుగా అదృశ్యమైంది. విలువైన కుర్చీలు, సీలింగ్ ఫ్యాన్, ఇనుప వస్తువులను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. అదేవిధంగా, ఆదిచుంచనగిరి ఆట స్థలం సమీపంలోని మరో రెండు బస్ షెల్టర్లు కూడా కనిపించకుండా పోయాయి. బస్టాండ్లు లేకపోవడంతో ప్రయాణీకులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ నిలబడుతూ తీవ్ర ఇక్కట్లు పడాల్సి వస్తోంది పాపం.