ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం అంధాకారం: ఉగాది వేడుకల్లో చంద్రబాబు
posted on Mar 30, 2025 2:27PM
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ దశ దిశ లేకుండా పోయిందని, రాష్ట్రం కళ తప్పిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఉగాది పర్వ దినాన్ని పురస్కరించుకని విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో కూటమి ప్రభుత్వం ఘనంగా వేడుకలు నిర్వహించింది. ఈ వే డుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కూటమి అధికారంలో రాగానే ప్రజా సమస్యలపైనే దృష్టి కేంద్రీకరించామన్నారు. సంక్షేమవ, అభివృద్దికి పెద్ద పీట వేస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం వేసిన చిక్కుముడులను ఒక్కోటి విప్పాల్సివస్తుందని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ అవసరం ఏర్పడిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను ఐటికి ప్రాధాన్యతనిచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఆ రోజు ఐటి అవసరం లేదని చాలామంది విమర్శించి చివరకు ఐటి మాత్రమే దిక్కయ్యిందని చంద్రబాబు అన్నారు. సెల్ ఫోన్ తిండిపెడుతుందా అని వ్యాఖ్యానించిన నేతల వద్ద ప్రస్తుతం సమాధానం లేకుండా పోయిందన్నారు. వర్క్ ఫ్రం హోం సంస్కృతి పెరగడానికి ఐటీ విప్లవమేనన్నారు. కూటమి ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిట్లో తేవడానికి వాట్స ప్ గవర్నెన్న్ తీసుకొచ్చినట్లు చెప్పారు. వివిధ సర్టిఫికేట్ల కోసం ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని లేకుండా సెకన్ల వ్యవధిలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సర్టిఫికేట్లను సెల్ ఫోన్ ద్వారా తీసుకునే వెసులు బాటు కల్పించినట్లు చంద్రబాబు చెప్పారు. పేదరిక నిర్మూలనకు మార్గదర్శి బంగారు కుటుంబం, పీ 4 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పేదరికం లేని సమాజం చూసినప్పుడే తన జన్మ చరితార్థమవుతుందని చంద్రబాబు అన్నారు