తిరుమలలో శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం
posted on Mar 30, 2025 8:41AM

విశ్వావసు నామ ఉగాది పర్వదినాన్నిపురస్కరించుకుని తిరుమల క్షేత్రంలో విశేష పూజలు, కార్యక్రమాలను నిర్వహించడానికి టీటీడీ సమాయత్తమైంది. ఉగాది ఆస్థానం, ఉగాది కవి సమ్మేళనం, నాద నీరాజనం, కవుల ఇష్టా గోష్టి వంటి కార్యక్రమాలు నిర్వహించనుంది. శ్రీవారి ఆలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఆస్థానం ఘనంగా జరిగింది. ఉదయం 7 నుండి 9 గంటల మధ్య ఈ ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, ఉగాధి అస్దానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది. తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న నాద నీరాజనం వేదికపై కవి సమ్మేళనం కార్యక్రమం ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభం కానుంది.
కాగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం (మార్చి 30) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నభక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఇక శనివారం (మార్చి 29) శ్రీవారిని మొత్తం 76 వేల 5 మంది దర్శించుకున్నారు. వారిలో 22 వేల 686 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 80లక్షల రూపాయలు వచ్చింది. తెల్లవారు జామునుంచే భక్తులు బారులు తీరి నిల్చున్నారు.