మానవ హక్కులను ఆశ్రయించిన ఉదయ్ సింహా
posted on Aug 4, 2015 8:05PM
.jpg)
తెలంగాణాలో తెదేపాను, ఆ పార్టీకి బలమయిన నేతగా ఎదుగుతున్న రేవంత్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతోనే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రపన్ని రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టి స్టింగ్ ఆపరేషన్ ద్వారా అతనిని ఓటుకి నోటు కేసులో ఇరికించారని తెదేపా నేతలు ఆరోపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ కేసు ఆధారంగా రేవంత్ రెడ్డితో సహా అనేకమంది తెదేపా నేతలను విచారించారు. ఈ కేసు విషయంలో వారు విచారణ దర్యాప్తు ఎప్పటికి పూర్తి చేస్తారో...అసలు పూర్తి చేస్తారో లేదో...కూడా ఎవరికీ తెలియదు.
రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహా, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలను జైలులో ఉంచి ఏసిబి అధికారులు అడగవలసినవన్నీ అడిగారు. కానీ విచారణ పేరిట ఏసిబి అధికారులు తనను వేదిస్తున్నారని ఆ కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ సింహా ఈ రోజు మానవ హక్కుల సంఘానికి పిర్యాదు చేసారు. దీనిపై స్పందించిన మానవ హక్కుల సంఘం ఈనెల 13లోగా తమకు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏసిబి అధికారులను ఆదేశించింది.
తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలలో ఇటువంటి వికృత క్రీడలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జయలలిత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి దానికే చాలాసార్లు బలయ్యారు. తెలంగాణాలో తెరాస ఇప్పుడు అధికారంలో ఉంది కనుక తన వంతు ఆట ఆడుతోంది. కానీ రేపు ప్రభుత్వం మారితే అప్పుడు ఆ పార్టీ కూడా తన వంతు ఆట ఆడకుండా ఉండబోదు. అప్పుడు తెరాస నేతలు దానికి మూల్యం చెల్లించవలసి వస్తే ఆశ్చర్యం ఉండదు. రాజకీయాలు ఒక ఔషదం లాగే వాడుకోవాలి తప్ప దానిని ఆయుధంగా వాడుకొంటే చివరికి దానికి ఇరు పక్షాలు తప్పక మూల్యం చెల్లించవలసి వస్తుందనే సత్యం గ్రహిస్తే ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి వికృత క్రీడలు ఆడేందుకు సాహసించబోదు.