జనసేన పార్టీని రాజకీయ పార్టీగా గుర్తించిన ఎన్నికల సంఘం

 

ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ 2014, మార్చి 14న స్థాపించిన జనసేన పార్టీని తెలంగాణా ఎన్నికల సంఘం రాజకీయపార్టీగా రిజిస్టర్ చేసినట్లు బుదవారం ప్రకటించింది. కనుక ఇకపై తెలంగాణాలో జరిగే ఏ ఎన్నికలలోనయినా జనసేన పార్టీ తన అభ్యర్ధులను నిలబెట్టవచ్చును. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తరువాత పవన్ కళ్యాణ్ మళ్ళీ తన సినిమాలతో బిజీ అయిపోయారు. వీలయితే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో తన పార్టీ తరపున అభ్యర్ధులను నిలబెడతానని అప్పుడే ప్రజలకు మాట ఇచ్చేరు. ఇప్పుడు జనసేనకు తెలంగాణా ఎన్నికల సంఘం గుర్తింపు కూడా వచ్చింది కనుక జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తన పార్టీ తరపున అభ్యర్ధులను నిలబెడతారా లేకపోతే మళ్ళీ ఎన్డీయే అభ్యర్ధులకే మద్దతు ప్రకటిస్తారా అనేది తెలుసుకోవాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే. ఒకవేళ పవన్ కళ్యాణ్ కి వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యక్ష రాజకీయాలలో వచ్చే ఉద్దేశ్యం ఉన్నట్లయితే, ఇప్పటి నుండే జనసేన పార్టీని గ్రామస్థాయి నుండి నిర్మించుకోవడం మంచిదని అభిమానులు భావిస్తున్నారు.